వంట ఏజెన్సీలకు పొగ

AP Govt Trying Removes Midday Meal Cooking Agency West Godavari - Sakshi

1,071 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ఎసరు

ఏకతాశక్తి ఏజెన్సీకి 5 క్లస్టర్‌ పాయింట్ల ఏర్పాటుకు అనుమతి

2,268 మంది కార్మికుల భవిష్యత్‌ ప్రశ్నార్థకం

పశ్చిమగోదావరి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : మధ్యాహ్న భోజన పథకం ద్వారా లక్షలాది మంది విద్యార్థుల పొట్ట నింపుతున్న వంట ఏజెన్సీల పొట్టకొట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జిల్లాలోని 18 మండలాల్లో 1,071 పాఠశాలల్లో ప్రస్తుతం విద్యార్థులకు వండి వడ్డిస్తున్న వంట ఏజెన్సీలను కాదని ఏకతాశక్తి అనే ఒకే ఏజెన్సీకి ఈ బాధ్యతను అప్పగించింది. ఈ ఏజెన్సీ ఆయా మండలాల పరిధిలో 5 ప్రాంతాల్లో క్లస్టర్‌ పాయింట్లు ఏర్పాటు చేసి అక్కడే వండి పాఠశాలలకు మధ్యాహ్న భోజనం సరఫరా చేయనుంది. ఇప్పటివరకూ ఆయా పాఠశాలల ఆవరణలోనే సమయానికి వేడివేడి ఆహారాన్ని అందించే ఏజెన్సీల స్థానంలో ఎక్కడో 5 క్లస్టర్‌ పాయింట్‌లలో వండి వెయ్యికి పైగా పాఠశాలలకు భోజనం సరఫరా చేసే విధానం అమలులోకి రానుంది. దీంతో విద్యార్థులకు సమయానికి భోజనం అందే విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రభావం జిల్లాలోని దాదాపు 1.17 లక్షల మంది విద్యార్థులపై పడనుంది. ప్రభుత్వ  నిర్ణయం కారణంగా ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న 2,268 మంది ఉపాధిపై తీవ్ర ప్రభావం పడనుంది.

దశలవారీగా ఏజెన్సీలకు ఎసరు
ఇప్పటి వరకూ మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేసిన స్వయం సహాయక సంఘాలను కాదని ప్రభుత్వం ఈ పథకాన్ని కేంద్రీకృతం చేస్తూ కొన్ని ఏజెన్సీలకే పరిమితం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే గతంలో గోదావరి విద్యా వికాస చైతన్య సొసైటీకి 8 మండలాల్లోని 54 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుకు అవకాశం కల్పించింది. దీనిలో 20,912 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన పథక లబ్ధిదారులుగా ఉన్నారు. ఈ ఏడాది నుంచి ఏకతాశక్తి అనే ఏజెన్సీకి 18 మండలాల్లోని 1071 పాఠశాలలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఇప్పటివరకూ జిల్లాలో ఉన్న మొత్తం 3,242 పాఠశాలల్లో 1,125 పాఠశాలలకు సంబంధించిన ఏజెన్సీలు గల్లంతైపోయాయి. ఈ పాఠశాలల్లో చదువుతున్న 1,38,679 మంది విద్యార్థులకు ఆయా ఏజెన్సీలే వండి పెడుతున్నాయి.

ఇక మిగిలింది 2117 పాఠశాలలే..
మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్రీకృతం చేసిన ఏజెన్సీలకు అప్పగించగా ప్రస్తుతం 2,117 పాఠశాలలకు మాత్రమే స్వయం సహాయక సంఘాల బృందాలు వండి వడ్డిస్తున్నాయి. ఆయా పాఠశాలల్లో మొత్తం 4,252 మంది వంట వారు, హెల్పర్లు ఉండగా 1,53,845 మంది విద్యార్థులకు వీరి సేవలందిస్తున్నారు. భవిష్యత్‌లో  వీరిని కూడా తొలగించి మరికొన్ని కేంద్రీకృత ఏజెన్సీల చేతికి అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

క్లస్టర్‌ పాయింట్లు ఇవే
ఏకతా శక్తి ఏజెన్సీకి కేటాయించిన 1,071 పాఠశాలల్లో 1.17 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడానికి ఆ సంస్థ 18 మండలాల పరిధిలో 5 క్లస్టర్‌ పాయింట్లను ఏర్పాటు చేసుకుంది. శనివారపుపేట జిల్లా పరిషత్‌ హైస్కూల్, గుండుగొలను జిల్లా పరిషత్‌ హైస్కూల్, ఉండి జిల్లా పరిషత్‌ హైస్కూల్, కానూరు జిల్లా పరిషత్‌ హైస్కూల్, యర్నగూడెం జిల్లా పరిషత్‌ హైస్కూళ్లలో ఈ క్లస్టర్‌ పాయింట్లను ఏర్పాటు చేసింది. ఆయా క్లస్టర్‌ పాయింట్ల నుండే వంటలు వండి విద్యార్థులకు భోజనం సరఫరా చేయనుంది.

విద్యార్థులకు సమయానికి అందేనా?
ఇదిలా ఉండగా ఏకతాశక్తి ఏజెన్సీ ఏర్పాటు చేసిన క్లస్టర్‌ పాయింట్ల ద్వారా సరఫరా చేయనున్న భోజనం విద్యార్థులకు సకాలంలో అందే అవకాశం ఉందా? అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే చోట వండి ఆ ప్రాంతానికి సుమారు 15–20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలకు సరఫరా చేయడం ఆషామాషీ వ్యవహారం కాదంటున్నారు. ఒక్కో క్లస్టర్‌ పరిధిలో చివరి పాఠశాలకు వెళ్లే సమయానికి ఆహార పదార్థాలు చల్లారిపోవడం, ఎప్పుడైనా ట్రాఫిక్‌ జామ్‌ కావడం, ఆహార పదార్థాలు సరఫరా చేసే వాహనాలు మరమ్మతులు, ప్రమాదాలకు గురైతే ఆ రోజు విద్యార్థులు పస్తులతో గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top