ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం

AP Govt Employees Chalo Assembly Over CPS - Sakshi

సాక్షి, అమరావతి: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం(సీపీఎస్‌) రద్దు చేసి.. పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ మంగళవారం ప్యాప్టో ఆధ్వర్యంలో చేపట్టిన చలోఅసెంబ్లీ రాజధాని ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారితీసింది. వివిధ జిల్లాల నుంచి అసెంబ్లీ ముట్టడికి తరలివస్తున్న ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ప్రకాశం బ్యారేజీ నుంచి వెలగపూడి వరకు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసులు.. స్కూల్‌ బస్సులు, ప్రైవేట్‌ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సుల్ని కూడా తనిఖీలు చేస్తున్నారు.

చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా విజయవాడ లెనిన్‌ సెంటర్‌కు భారీగా ఉద్యోగులు చేరుకున్నారు. పలుచోట్ల ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ఈడ్చుకుంటూ వెళ్లారు. మహిళల ఉద్యోగులను సైతం పోలీసులు ఈడ్చుకెళ్లారు. ఉద్యోగులను బలవంతంగా అరెస్ట్‌ చేసి పోలీసు స్టేషన్‌లకు తరలించారు. చాలా చోట్ల ఉద్యోగులపై దారుణంగా ప్రవర్తించారు. 

ఉద్యోగుల అక్రమ అరెస్టులపై పీడీఎఫ్‌ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. సీపీఎస్‌పై వైఎస్‌ జగన్‌ ఇప్పటికే తన వైఖరి ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ విషయంలో టీడీపీ తన వైఖరి వెల్లడించడానికి ఇబ్బందేంటని ప్రశ్నించారు. ఎన్నడు లేని విధంగా ఉపాధ్యాయులను అరెస్ట్‌ చేయడంపై మండిపడ్డారు. సీపీఎస్‌ రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని విమర్శించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో సీపీఎస్‌పై చర్చిస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందని తెలిపారు. ఏపీలో వేలాది మంది ఉపాధ్యాయులను అరెస్ట్‌ చేశారని.. ప్రభుత్వం వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అంతకుముందు ఉపాధ్యాయుల అక్రమ అరెస్ట్‌లపై శాసనమండలిలో పీడీఎఫ్‌ సభ్యులు వాయిదా తీర్మానం ఇవ్వగా.. మండలి చైర్మన్‌ దానిని తిరస్కరించారు. దీంతో సీపీఎస్‌ రద్దుతో పాటు ఉపాధ్యాయుల అక్రమ అరెస్ట్‌పై మండలిలో చర్చ చేపట్టాలని పీడీఎఫ్‌ సభ్యులు చైర్మన్‌ పోడియం ముందు నిరసనకు దిగారు. సీపీఎస్‌ రద్దు చేయమంటే అక్రమ అరెస్టుల చేస్తారా అని మండిపడ్డారు. ఉపాధ్యాయులు అనుకుంటున్నారా.. ఉగ్రవాదులు అనుకుంటున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్కూళ్లలోకి వెళ్లి ఉపాధ్యాయులను అరెస్ట్‌ చేయాల్సిన అవసరమేముందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎస్‌ రద్దుపై మండలిలో వెంటనే చర్చ జరపాలని.. దీనిపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని పీడీఎఫ్‌ సభ్యులు పట్టుబట్టారు. సీపీఎస్‌ రద్దుపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా పీడీఎఫ్‌ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top