బాక్సైట్‌ తవ్వకాలకు సర్కారు నో  | AP Government No Permission For Bauxite Mining | Sakshi
Sakshi News home page

బాక్సైట్‌ తవ్వకాలకు సర్కారు నో 

Jul 9 2019 5:44 AM | Updated on Jul 9 2019 8:55 AM

AP Government No Permission For Bauxite Mining - Sakshi

సాక్షి, అమరావతి: విశాఖపట్నం ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలను ఎట్టిపరిస్థితుల్లో జరిపే అవకాశం లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కార్యాలయానికి తేల్చి చెప్పింది. బాక్సైట్‌ సరఫరా ఒప్పందం రద్దు వ్యవహారంపై ఏపీ హైకోర్టులో విచారణ నడుస్తున్నందున లండన్‌ ఆర్బిట్రేషన్‌ను (మధ్యవర్తిత్వం) నిలుపుదల చేయించాలని ప్రధానమంత్రి కార్యాలయాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని రాష్ట్ర గనుల శాఖ, ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ప్రతినిధి బృందం ఈ మేరకు పీఎంవోకు విజ్ఞప్తి చేసింది. విశాఖపట్నం ఏజెన్సీలో మైనింగ్‌ లీజులు, ఇతర అనుమతులన్నీ లభిస్తే అక్కడ తవ్వే ఖనిజాన్ని సరఫరా చేస్తామంటూ ఏపీఎండీసీ గతంలో ఆన్‌రాక్‌ జాయింట్‌ వెంచర్‌ సంస్థతో ఒప్పందం చేసుకుంది. తర్వాత కాలంలో ప్రభుత్వాలు మారడం, ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలు జరపరాదని గిరిజనులు డిమాండ్‌ చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఒప్పందాన్ని ఏపీఎండీసీ రద్దు చేసుకుంది.

ఈ మేరకు ఏపీఎండీసీ, ఆన్‌రాక్, రస్‌ ఆల్‌ ఖైమా సంస్థల మధ్య కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసినట్టు ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిని ఆన్‌రాక్‌ సంస్థ హైకోర్టులో సవాల్‌ చేయగా, విచారణ కొనసాగుతోంది. మరోవైపు దుబాయ్‌కు చెందిన ఆన్‌రాక్‌ భాగస్వామ్య సంస్థ రస్‌ ఆల్‌ ఖైమా సంస్థ లండన్‌ కోర్టులో ఈ అంశంపై ఫిర్యాదు చేసింది. బాక్సైట్‌ ఖనిజం సరఫరా ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల తాము నష్టపోయామని, అందుకు భారత ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించాలని కోరింది. దీనిపై ఏడాదిగా లండన్‌ కోర్టులో ఆర్బిట్రేషన్‌ సాగుతోంది. ఈ నేపథ్యంలో పీఎంవో రాష్ట్ర అధికారులను పిలిపించి వివరాలు కోరింది. ఆగస్టు 5న లండన్‌లో ఆర్బిట్రేషన్‌కు రావాలని లండన్‌ కోర్టు నుంచి ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ అందిన నేపథ్యంలో అక్కడ అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయడం కోసం పీఎంవో అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని పిలిపించారు.

‘ఇప్పటివరకూ జరిగిన పరిణామాలు, అందుకు దారితీసిన పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున వినిపించాల్సిన వాదనకు సంబంధించి సమగ్ర పత్రాలు పంపించండి’ అని ప్రధాని కార్యాలయం రాష్ట్ర అధికారులకు సూచించింది. ‘మైనింగ్‌ లీజులతోపాటు అన్ని అనుమతులు లభిస్తే ఖనిజాన్ని తవ్వి ఆన్‌రాక్, రస్‌ ఆల్‌ ఖైమాకు సరఫరా చేస్తామని ఏపీఎండీసీ ఒప్పందం చేసుకుంది. అయితే, కొన్ని అనుమతులు రాలేదు. దీనివల్ల లీజులు ల్యాప్స్‌ అయ్యాయి. అందువల్ల ఖనిజాన్ని సరఫరా చేయలేకపోయినందుకు ఏపీఎండీసీ నష్టపరిహారం చెల్లించాల్సిన పనిలేదు’అని సీఎస్‌ వివరించారు. దీనిని బలపరిచేలా ఆధారాలు పంపాలని పీఎంవో అధికారులు సూచించారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement