ఆర్టీసీ విలీనానికి ఓకే! 

AP Government has approved the RTC merger - Sakshi

తొలి విడతలో 350 విద్యుత్‌ బస్సులకు గ్రీన్‌సిగ్నల్‌ 

ఆమోదించిన పాలక మండలి 

సాక్షి, అమరావతి : ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి ఆమోదముద్ర పడింది. సంస్థ వైస్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణబాబు అధ్యక్షతన శుక్రవారం విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎజెండాలో ప్రాధాన్యాంశంగా ఆర్టీసీ విలీన ప్రక్రియను చేర్చి దానిని ఆమోదిస్తూ పాలక మండలి తీర్మానం చేసింది. విలీనానికి ముందు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌ (పీటీడీ) ఏర్పాటుకు సంబంధించి విధి విధానాలు, కమిటీ నియామకాలకూ ఆమోదం తెలిపింది. అలాగే, తొలి విడతగా 350 విద్యుత్‌ బస్సులను  ప్రవేశపెట్టేందుకు అనుమతిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్‌స్టేషన్లలో రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్ల నిర్వహణకు సంబంధించి లైసెన్సుల పొడిగింపునూ ఆమోదించారు. సమావేశంలో తీసుకున్న ఇతర నిర్ణయాలు.. 

- బ్రెడ్‌ విన్నర్‌ స్కీం కింద (ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూ చనిపోయిన కుటుంబాల వారసులకు ఉద్యోగం ఇచ్చే విధానం) దరఖాస్తుల గడువును తగ్గించేందుకు ప్రతిపాదనలను ఆమోదించారు.   

-  ఆర్టీసీని కంప్యూటరీకరణ చేస్తున్నందున జూనియర్‌ అసిస్టెంట్‌ (స్టాటిస్టిక్స్‌) పోస్టుల్ని రద్దుచేశారు.  

-  విశాఖలోని ఎంవీపీ బస్‌స్టేషన్‌లో ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేస్‌ నిర్వహిస్తున్న రిజర్వేషన్‌ కౌంటర్‌ లైసెన్సును మూడేళ్లు, అనంతపురం జిల్లా పుట్టపర్తి బస్‌స్టేషన్‌లో సౌత్‌ వెస్ట్రన్‌ రైల్వేస్‌ రిజర్వేషన్‌ కౌంటర్‌ లైసెన్సును పదేళ్లు, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి బస్‌స్టేషన్‌లో సివిల్‌ కోర్టు నడిపేందుకు లైసెన్సును మరో ఐదేళ్లపాటు పొడిగిస్తూ బోర్డు నిర్ణయించింది. 

-  విజయవాడ పాత బస్టాండ్‌ వద్ద 2,836 చదరపు మీటర్ల ఆర్టీసీ స్థలాన్ని  బీఓటీ పద్ధతిలో అభివృద్ధికి ఉద్దేశించిన లీజు అగ్రిమెంట్‌ రద్దుకు బోర్డు ఆమోదించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top