మాయా మశ్చీంద్ర! | ap contracters scam in telangana fisheries | Sakshi
Sakshi News home page

మాయా మశ్చీంద్ర!

Jan 30 2017 1:12 AM | Updated on Jun 2 2018 2:56 PM

మాయా మశ్చీంద్ర! - Sakshi

మాయా మశ్చీంద్ర!

రాష్ట్రంలో చేప పిల్లల పంపిణీలో భారీ గోల్‌మాల్‌ బట్టబయలవుతోంది.

చేప పిల్లల పంపిణీలో భారీ గోల్‌మాల్‌
ఏపీ కాంట్రాక్టర్ల చేతివాటం

- 27 కోట్ల చేప పిల్లల్లో పంపిణీ చేసింది మూడో వంతే!
- చేప సైజు.. సంఖ్య.. వాటిని తెచ్చిన వాహనాల లెక్కలన్నింటా అక్రమాలే
- అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రెచ్చిపోయిన కాంట్రాక్టర్లు
- మహబూబ్‌నగర్‌లో 88 వేల చేప పిల్లలకుగాను 18 వేలే తెచ్చిన వైనం
- ఎమ్మెల్యే చొరవతో చేప పిల్లల్ని లెక్కించగా బయటపడ్డ బండారం
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో చేప పిల్లల పంపిణీలో భారీ గోల్‌మాల్‌ బట్టబయలవుతోంది. చేప పిల్లల సంఖ్యలో దొంగ లెక్కలు చూపించి కాంట్రాక్టర్లు కోట్లు కొల్లగొట్టారు. మత్స్యశాఖ అధికారుల అలసత్వాన్ని, పర్యవేక్షణ లోపాన్ని ఆసరాగా చేసుకొని అడ్డగోలు దందాకు పాల్పడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా చేప పిల్లల పంపిణీపై ప్రభుత్వం ఈ ఏడాది ప్రత్యేకంగా దృష్టి సారించింది. అక్టోబర్‌లో రాష్ట్రమంతటా వర్షాలు కురియటంతో.. అప్పట్నుంచి వరుసగా రెండు నెలలపాటు ప్రభుత్వం అన్ని జిల్లాలకు పెద్ద ఎత్తున చేపల పంపిణీ చేసింది. రూ.24 కోట్ల ఖర్చుతో 27 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేసినట్లు లెక్కలున్నాయి. కానీ వాస్తవానికి ఇది పది కోట్లకు మించలేదని తెలుస్తోంది. 27 కోట్లలో మూడోవంతు మాత్రమే సరఫరా చేసి కాంట్రాక్టర్లు మాయ చేశారు.

కాంట్రాక్టర్లు ఆడిందే ఆట..
గతంతో పోలిస్తే ఈ ఏడాది ప్రభుత్వం తక్కువ ధరలో చేప పిల్లలు కొనుగోలు చేసింది. ఒక్కో జిల్లాకు ఒక్కో రేటు చొప్పున టెండర్లను ఖరారు చేసింది. కనిష్టంగా 70 పైసల నుంచి గరిష్టంగా 90 పైసలకు ఒకటి చొప్పున చేప పిల్లలను కొనుగోలు చేశారు. ఏపీలోని  కైకలూరు ప్రాంతం నుంచి కాంట్రాక్టర్లు ఈ చేప పిల్లలను రాష్ట్రానికి పంపిణీ చేశారు. గతంలో రూ.1.10 నుంచి రూ.1.50 రేటుతో కొనుగోలు చేశారని, ఈ లెక్కన ఈసారి భారీగా ఆదా చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ భారీ మొత్తంలో సరఫరా చేసే బాధ్యతను కాంట్రాక్టర్లకు అప్పగించి చేతులు దులుపుకోవటం కొంప ముంచింది. మత్స్యశాఖలో తగినంత ఉద్యోగులు, సిబ్బంది లేకపోవటంతో కాంట్రాక్టర్లు చేప పిల్లల సంఖ్యలో గోల్‌మాల్‌ చేశారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో చేప పిల్లలను చెరువులు, కుంటల్లో వేయాలని ప్రభుత్వం సూచించింది. కానీ రాష్ట్రంలో సగానికిపైగా ఎమ్మెల్యేలు వీటి జోలికే వెళ్లలేదు. దీంతో పర్యవేక్షణ లేదనే ధీమాతో కాంట్రాక్టర్లు తమకు తోచిన విధంగా దొంగ లెక్కలు రాసుకున్నారు.

వాహనాల ట్రిప్పుల్లోనే గోల్‌మాల్‌
ఏపీలోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల నుంచి చేపలను సరఫరా చేసేందుకు కాంట్రాక్టర్లు డీసీఎం వ్యాన్లను ఉపయోగించారు. వ్యాన్లలో ఆక్సిజన్‌ సిలిండర్లు అమర్చిన నీటి ట్యాంకుల్లో చేప పిల్లలను వేసి రవాణా చేశారు. చెక్‌ పోస్టులు దాటిన చేప పిల్లల వాహనాలు, చెరువులకు రవాణా చేసిన వాహనాల సంఖ్యకు చాలా తేడా ఉందని ఇప్పటికే ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందాయి. ఒక్కో వ్యాన్‌లో పది డ్రమ్ములుంటాయి. ఒక్కో డ్రమ్ములో పది వేల చొప్పున.. వ్యాన్‌లో లక్ష పిల్లలను రవాణా చేసే వెసులుబాటు ఉంటుంది. రాష్ట్రంలో 27 కోట్ల చేప పిల్లలను రవాణా చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కన 2,700 వాహనాలు ఏపీలోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల నుంచి మార్కెట్‌ సెస్‌ కాపీల ద్వారా రవాణా కావాలి.

కానీ చెక్‌పోస్టులు దాటి వచ్చిన చేప పిల్లల వాహనాలు వెయ్యికి మించలేదని, రాష్ట్రంలోకి వచ్చాక హైదరాబాద్‌ కేంద్రంగా వాహనాల సంఖ్యను పెంచి, చేప పిల్లల సంఖ్యను పెంచి చూపించినట్లు తెలుస్తోంది. ఏపీకి చెందిన ముగ్గురు బడా కాంట్రాక్టర్లు, వరంగల్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధి ఒకరు బినామీ కాంట్రాక్టరుగా ఈ చేపల లెక్కల బాగోతంలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం చెరువుల్లో చేపలు విడిచే సమయంలో తప్పనిస రిగా వీడియో, ఫొటో చిత్రీకరించాలి. కానీ రాష్ట్రంలో 4,500 చెరువుల్లో చేప పిల్లల పంపిణీ సమయంలో ఈ నిబంధన పాటించలేదు. నిబంధనల ప్రకారం 80 మి.మీ. నుంచి 100 మి.మీ. పరిమాణం ఎదిగిన చేప పిల్లలనే కాంట్రాక్టర్లు సరఫరా చేయాలి. కానీ రాష్ట్రానికి తెచ్చిన చేప పిల్లలు ఇంత కంటే చిన్నగా ఉన్నాయన్న ఆరోపణలున్నాయి.

పోసింది 18 వేలు.. చూపించింది 88 వేలు
మహబూబ్‌నగర్‌ జిల్లాలో గండేడు మండలంలో ఉన్న సాలార్‌నగర్‌ రిజర్వాయర్‌లో 88 వేల చేప పిల్లల సరఫరాకు కాంట్రాక్టర్లు ఇండెంట్‌ తీసుకున్నారు. పంపిణీ చేసే రోజున స్థానిక పరిగి నియోజకవర్గం ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి చేప పిల్లలను లెక్కించాలని డిమాండ్‌ చేశారు. మత్స్యశాఖ అధికారుల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ లెక్కింపులో 18 వేల చేప పిల్లలే ఉన్నట్లు తేలింది. దీంతో కాంట్రాక్టర్లు నాలుగు రెట్లకుపైగా దొంగ లెక్కలు చెప్పి.. నాటకమాడుతున్న తీరును చూసి అధికారులతో పాటు స్థానికులు నివ్వెరపోయారు. దీంతో కాంట్రాక్టరు ఆ నియోజక వర్గంలోని మిగిలిన చెరువులన్నింటా మరోసారి చేపలను సరఫరా చేయటంతో పాటు.. బిల్లులను అడ్డుకోకుండా అక్కడి నేతలను ప్రాధేయపడ్డట్లు సమాచారం. ఇదే తరహాలో పలువురు ఎమ్మెల్యేలు చేప పిల్లల పంపిణీలో కాంట్రాక్టర్ల చేతివాటంపై అధికారులకు ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్‌ జిల్లాలోని తొర్రూర్‌ మండలం అరిపిరాలతోపాటు ఆదిలాబాద్‌ జిల్లాల్లో పలుచోట్ల కాంట్రాక్టర్లు చేప పిల్లల సరఫరాలో గోల్‌మాల్‌ చేశారంటూ గ్రామ ప్రజలే ఆందోళనకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement