‘మొక్క’ తొడిగిన ‘పచ్చని’ ఆశయం 

AP CM Attended Vanamahotsava In tadikonda - Sakshi

పచ్చదనం పెంపుదలే ధ్యేయంగా వనమహోత్సవ యజ్ఞంలో భాగంగా శనివారం గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు వద్ద జరిగిన 70వ వనమహోత్సవ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ యజ్ఞంలో పాల్గొని వేప మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అటవీ శాఖ ఏర్పాటు చేసిన జీవ వైవిధ్యం, వన్యప్రాణి సంరక్షణ  ప్రదర్శనశాలను   ముఖ్యమంత్రి  పరిశీలించారు. రాష్ట్రంలో ఈ ఏడాది 25 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా అన్ని శాఖల సహకారంతో కృషిచేయనున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ కనీసం రెండు మూడు మొక్కలు నాటితే భవిష్యత్తు తరాలు భద్రమైన జీవితాన్ని గడపగలుగుతాయని అన్నారు. ఈ మేరకు సభాప్రాంగణంలో ఉన్న వారందరితో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. 

సాక్షి, తాడికొండ(గుంటూరు) : జాతీయ అటవీ చట్టం ప్రకారం రాష్ట్ర విస్తీర్ణంలో 33 శాతం మొక్కలు పెంచడమే లక్ష్యంగా పచ్చదనం పెంపొందించడానికి అన్ని శాఖల సహకారంతో ఈ ఏడాది రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం సంకల్పించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. 70వ వన మహోత్సవంలో భాగంగా గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రులో శనివారం నిర్వహించిన సభలో ఆయన ప్రసంగిస్తూ భూమి మీద పచ్చదనం లేకపోతే భవిష్యత్తులో అంతా ఎడారిగా మారిపోతుందని, పంచభూతాలను మనం పరిరక్షించుకోవాలని అన్నారు. 

ఏలిన వారు మంచివారైతే...: మంత్రి బాలినేని
రాష్ట్రాన్ని పచ్చదనం చేసేందుకు చేస్తున్న ఈ ప్రయత్నంలో వరుణుడు కూడా కరుణించాడని, గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో వర్షాలు లేవని, పెద్దలు అన్న రీతిలో ఏలిన వారు మంచివారైతే వర్షాలు పడతాయని జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి సాగర్, శ్రీశైలం ఇతర ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయని రాష్ట్ర ఇంధన వనరులు, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక రంగ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు.  గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో హరితాంధ్రప్రదేశ్‌ చేయాలని కలలు కన్నారని, నేడు జగన్‌ మోహన్‌రెడ్డి హయాంలో ఆ కల నెరవేరనుందన్నారు. అటవీ శాఖకు సంబంధించి ఎర్ర చందనం నిల్వలు కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రమే ఉన్నాయని, అక్కడ స్మగ్లింగ్‌ చేసి దోచుకున్న పరిస్థితులు గతంలో ఉన్నందున ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహనరెడ్డి వచ్చిన తరువాత ఎర్ర చందనం కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారన్నారన్నారు. ఎర్రచందనం అమ్మేందుకు అనుమతివ్వాలని కేంద్ర మంత్రిని కోరామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన కంఫా నిధులు రూ.1734 కోట్లు అందుబాటులోకి వచ్చాయని వాటిని సద్వినియోగం చేసి రాష్ట్రంలో విస్తారంగా పచ్చదనం పెంచేందుకు కృషి  చేస్తానన్నారు.

శ్రామికుల కష్టాలు, కన్నీళ్లు, తుడిచే నాయకుడు జగనన్న
శ్రామికుల కష్టాలు, కన్నీళ్లు తుడిచే నాయకుడు వైఎస్‌ జగనన్న అని, వ్యవసాయం అంటే దండగ కాదు పండగ అని నిరూపిస్తూ అభివృద్ధిని పరుగులెత్తిస్తున్న ముఖ్యమంత్రికి పాదాభివందనమని తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. రాజధానిలో ఎమ్మెల్యేగా గెలిపించినందుకు తాడికొండ నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. 

అధికారులకు ఆయుధాలు, పురస్కారాల పంపిణీ
అనంతరం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌లు, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌లకు ఆయుధాలు పంపిణీ చేశారు. చిత్తూరు ఈస్ట్‌ డివిజన్‌ ఎఫ్‌ఎస్‌వో చినబాబు, ఆర్‌.సలాఉద్దీన్, ఎఫ్‌డీవో లక్ష్మీ ప్రసాద్, పి.కామేశ్వరరావు, ఎస్‌.రవిశంకర్‌ తదితరులకు ఆయుధాలను పంపిణీ చేశారు. విధుల్లో నైపుణ్యాలు ప్రదర్శించిన 80 మంది అటవీ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణరావు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, నంబూరు శంకరరావు, విడదల రజని, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, కిలారి వెంకట రోశయ్య, డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు. సామినేని ఉదయభాను వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శులు లేళ్ల అప్పిరెడ్డి, మర్రి రాజశేఖర్, గుంటూరు–2 సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం, నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌ గాంధీ, పార్టీ నాయకులు నూతలపాటి హనుమయ్య, కావటి మనోహర్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు. 


సీఎంకు బోన్సాయ్‌ మొక్కను బహూకరిస్తున్న మంత్రి బాలినేని 

సభ కొనసాగిందిలా...
• ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహనరెడ్డికి మొక్కలనే పుష్పగుచ్ఛంగా  స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఐఏఎస్‌ అందజేశారు.
• సీఎం ప్రసంగం ప్రారంభించే సమయంలో మహిళలు, విద్యార్థులు సీఎం, సీఎం అంటూ ఉత్సాహభరితంగా చేతులు పైకెత్తి కేరింతలు కొట్టడంతో ఆయన ఉత్సాహంగా నవ్వుతూ ప్రసంగం     ప్రారంభించారు. 
• ప్రసంగం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సభా ప్రాంగణంలో ఉన్నవారందరితో ప్రతిజ్ఞ చేయించారు.
• అటవీ శాఖ తరఫున ముఖ్యమంత్రికి మంత్రి బాలినేని చేతుల మీదుగా పలువురు అధికారులు బోన్సాయ్‌ ప్లాంట్‌ను బహుమతిగా అందజేశారు. 
• కార్యక్రమం చివరిలో జనగణమన జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top