కౌలు రైతులకు జగన్‌ సర్కార్‌ వరాల జల్లు!

The AP Cabinet Approves Draft Bill Which Helps The Tenant Farmers - Sakshi

11 నెలల  కాలానికి సాగు ఒప్పంద పత్రాలు

వైఎస్సార్‌ భరోసా, ఉచిత పంటల బీమా వర్తింపు

పంట రుణాలు పెద్ద మొత్తంలో ఇచ్చేందుకు సన్నాహాలు

అనందం వ్యక్తం చేస్తున్న కౌలు రైతులు

సాక్షి, అమరావతి: కౌలు రైతులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వరాల జల్లు కురిపించారు. ఇందులో భాగంగానే కౌలు రైతు ముసాయిదా బిల్లుకు ప్రభుత్వం అమోద ముద్ర వేసింది. భూయజమానుల హక్కులకు భంగం కలగకుండా, కౌలు రైతులకు 11 నెలల కాలానికి సాగు ఒప్పంద పత్రాలు ఇస్తున్నారు. దీని వలన రైతులకు ఒనగూరే ప్రయోజనాలన్నీ చేకూరనున్నాయి. వీరికి వైఎస్సార్‌ రైతు భరోసాపాటు, ఉచిత పంటల బీమా, పంట రుణాలు, ఇన్‌పుట్‌ సబ్సిడీ వంటి పథకాలు అందనున్నాయి. జిల్లాలో దాదాపు 3.60 లక్షల మందికిపైగా కౌలు రైతులు ఉన్నారు.

గత ఏడాది కేవలం 1.02 లక్షల మందికి మాత్రమే ఎల్‌ఈసీ (రుణ అర్హత కార్డులు) సీవోసీలు (సాగు ధ్రువీకరణ పత్రాలు) ఇచ్చారు. గత ఏడాది కౌలు రైతులకు రూ.200 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. అయితే బ్యాంకర్లు పంట రుణాలు కేవలం రూ158.95 కోట్ల రుణాలు ఇచ్చారు. ఈ ఏడాది కౌలు రైతులకు రూ.1100 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 75,800 ఎల్‌ఈసీ కార్డులు, 1000 సీవోసీ పత్రాలు ఇచ్చారు. జిల్లాలో ఎక్కువ మంది పంటలు సాగు చేసేది కౌలు రైతులే కావడం విశేషం.

సీఎం చొరవతో.. 
ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపడంతో పంటలు సాగు చేసే రైతులందరికీ సాగు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేలా కౌలు రైతుల చట్టానికి సవరణ చేశారు. జిల్లాలో దాదాపు 3.60 లక్షల మంది కౌలు రైతులకు వైఎస్సార్‌ భరోసా కింద ఏడాది రూ.12,500 ఇవ్వనున్నారు. సాగు చేసిన పంటలకు ప్రమాద బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ వర్తింపజేస్తారు. ప్రధానంగా పంట రుణాలు ఎక్కువ మొత్తంలొ అందనున్నాయి. గత ప్రభుత్వ హయంలో కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీసం గుర్తింపు కార్డులు కూడా దక్కలేదు. దీంతో పంట పెట్టుబడులు రాక తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వం చూపుతున్న ప్రత్యేకాభిమానంతో  కౌలు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సెంటు భూమి ఉండదు.. కానీ ఆ భూమాతకు పచ్చని పారాణి పూసేది ఆయనే.. పెట్టుబడైనా వస్తుందనే గ్యారంటీ లేదు.. కానీ ఆ పుడమి తల్లి ఒడిలోనే గుప్పెడు మెతుకుల కోసం ఆరాటపడేది ఆయనే.. మద్దతు ధర దక్కుతుందనే నమ్మకం లేదు.. కానీ ఏదొక రోజు తన లోగిలిలో సిరుల పంట పండుతుందని ఆశగా ఎదురుచూసేది ఆయనే.. మొక్క ఒంగినా కుంగిపోయేది ఆయనే.. పంట పచ్చగా నవ్వితే పులకించిపోయేది ఆయనే.. పొట్టకొచ్చిన కంకులను చూసి పొంగిపోయేదీ ఆయనే.. చివరకు ప్రకృతి వైపరీత్యాలకు, ప్రభుత్వ నిరాదరణకు నిండా మునిగేదీ ఆయనే.. ఆయనే ఆకుపచ్చని చందమామైన కౌలు రైతు.. ఇప్పుడా కౌలు రైతు బతుకుల్లో వెన్నెల వెలుగులు రాబోతున్నాయి. సీఎం వైఎస్‌         జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ నిర్ణయంతో రారమ్మని బ్యాంకు రుణాలు పిలవబోతున్నాయి. అసెంబ్లీలో కౌలు రైతుల ముసాయిదా బిల్లుకు ఆమోదముద్ర పడి.. అన్నదాత ఇంట ఆనందాల పచ్చని కంకులు వేయబోతున్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top