‘మన బడి నాడు-నేడు’కు 3వేల కోట్లు..

AP Budget; 3000 Crore Allocated For Mana Badi Nadu Nedu Scheme - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను చదువుల బడిగా మార్చేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకెళ్తోంది. సామాజికంగా పేదల గడపల్లో చదువుల వెలుగులు పంచే గొప్ప దార్శనికతతో కూడిన పథకంగా ‘అమ్మ ఒడి పథకానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. పేద బిడ్డల చదువుల వెలుగుగా ‘అమ్మ ఒడి’ నిలిచిపోతుంది. ఈ పథకం ద్వారా కుల,మత,వర్గ, ప్రాంత వివక్ష లేకుండా పేద కుటుంబాల పిల్లలు 1 నుంచి ఇంటర్‌ వరకు గుర్తింపబడిన ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలో చదువుకోవడం సాధ్యమవుతుంది. (ఏపీ బడ్జెట్ సమావేశాలు)

సదుపాయాల కల్పనే లక్ష్యంగా..
ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాల కల్పనే లక్ష్యంగా మొదటి దశలో ఎంపిక చేసిన 15,715 పాఠశాలల్లో తల్లిదండ్రుల భాగస్వామ్యం ద్వారా ‘మన బడి నాడు-నేడు’  పథకాన్ని అమలు పరచడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2020-21 బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.3,000 కోట్లు కేటాయించింది. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి పదో తరగతి విద్యార్థులకు 3 జతల యూనిఫామ్‌లు, నోటు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, 2 జతల సాక్సులు,బెల్టు స్కూల్‌ బ్యాగ్‌ మొత్తం స్టూడెంట్‌ కిట్‌గా ’ జగనన్న విద్యాకానుక’  పేరిట అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. (ఏపీ బడ్జెట్‌: పేదల ఆరోగ్యానికి కొండంత భరోసా)

చిన్నారుల ఆరోగ్య ప్రమాణాల పెంపుదలపై ప్రత్యేక శ్రద్ధ
‘జగనన్న గోరుముద్ద’ పథకం ద్వారా చిన్నారుల ఆరోగ్య ప్రమాణాల పెంపుదలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు రుచి, పుష్టికరమైన ఆహారం అందించాలని మధ్యాహ్న భోజన పథకం మెనూ అమలుకు సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ కొత్త మోను ఈ ఏడాది జనవరి 21 నుంచి అమలవుతోంది. వీటితో పాటు మధ్యాహ్న భోజనం వండి పెట్టే వంట మనుషులకు ఇచ్చే నెలవారీ పారితోషికాన్ని రూ.1000 నుంచి రూ.3000కు ప్రభుత్వం పెంచింది. సెకండరీ, ఇంటర్‌ విద్యాశాఖల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.22,604 కోట్లు కేటాయించింది. (విశాఖనే పరిపాలన రాజధాని)

ఉన్నత విద్యావకాశాలు మెరుగుకోసం..
విద్యార్థుల ఉన్నత విద్యావకాశాలను మెరుగుపర్చడం కోసం జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాలు అమలు చేయడంతో పాటు ఉన్నత స్థాయి నిపుణుల సంఘం వారి సూచనల ప్రకారం పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా ఇంజనీరింగ్‌ కరికులంను సరిదిద్దింది. రాష్ట్ర విశ్వ విద్యాలయాల్లోనూ, వాటి అనుబంధ కళాశాలలోనూ కొత్త కరికులం 2019-20 విద్యా సంవత్సరం నుంచి జరుగుతోంది. ఆంధ్రా యూనివర్శిటీకి రూసా పథకం కింద నిధులు మంజూరు చేయనున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఉన్నత విద్యారంగానికి రూ.2,277 కోట్లు కేటాయించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top