సుస్థిరమైన అభివృద్ధిలో ఏపీ ముందడుగు

AP breakthrough in sustainable development - Sakshi

‘ఉపాధి’ కల్పనలో మరింత మెరుగ్గా..  

స్త్రీ, పురుషుల నిష్పత్తిలోనూ మంచి ఫలితాలు.. 

100 సూచికల ఆధారంగా నీతి ఆయోగ్‌ ర్యాంకులు ప్రకటన 

సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాల్లో ఆంధ్రప్రదేశ్‌ అనేక రంగాల్లో ముందడుగు వేసింది. 2018–19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2019–20లో ఎంతో మెరుగైన రీతిలో పనితీరు కనబర్చింది. ఉపాధి పనుల కల్పనలోగానీ, ధాన్యం ఉత్పత్తిలోగానీ, ప్రజారోగ్యంలోగానీ ఎంతో పురోగతి సాధించింది.. రక్షిత తాగునీటి సరఫరా.. శాంతిభద్రతల్లో అగ్రగామిగా నిలిచింది. 100 సూచీల ఆధారంగా నీతి ఆయోగ్‌ ప్రకటించిన ర్యాంకుల్లో ఏపీ ఈ ఘటన సాధించింది. అందరికీ న్యాయం అందించడంతో పాటు అసమానతలను తొలగించడంలో మన రాష్ట్రం మంచి ఫలితాలు సాధించింది. మొత్తం మీద సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భారత్‌ ‘60 స్కోరు’ సాధించిగా, రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌ ‘67 స్కోర్‌’ సాధించింది.    

రంగాల వారీగా చూస్తే..
► స్త్రీ–పురుష నిష్పత్తి 2018–19లో 913 ఉంటే.. 2019–20లో అది 916కు పెరిగింది.
► బహిరంగ మలవిసర్జన రహితం విషయానికొస్తే.. ఏపీలో 2018–19లో 30.77 శాతం ఉండగా 2019–20లో అది 100 శాతానికి చేరింది. 
► రాష్ట్రంలో గృహాల విద్యుదీకరణ 2018–19లో 99 శాతం ఉండగా 2019–20లో నూరు శాతానికి చేరుకున్నట్లు నీతి ఆయోగ్‌ పేర్కొంది. 
► నివాస ప్రాంతాలకు సీఎంజీఎస్‌వై (ముఖ్యమంత్రి గ్రామ సడక్‌ యోజన) కింద రహదారి సౌకర్యం 2018–19లో 18 శాతమే కల్పించగా 2019–20లో 73 శాతం కల్పించినట్లు నీతి ఆయోగ్‌ వెల్లడించింది.
► అలాగే, 2018–19లో వంద మంది జనాభాకు 90.92 శాతమే మొబైల్‌ ఫోన్లు వినియోగించగా 2019–20లో అది 95.76 శాతానికి పెరిగింది. 
► వంద మంది జనాభాకు 2018–19లో ఇంటర్నెట్‌ వినియోగం 37.21 శాతం ఉండగా 2019–20లో అది 54.53 శాతానికి పెరిగింది. 
► పీఎంఏవై (ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన) కింద 2018–19లో ఇళ్ల నిర్మాణం 2.48 శాతమే ఉండగా 2019–20లో 24.89 శాతానికి చేరింది.
► వార్డుల్లో డోర్‌ టు డోర్‌ చెత్త సేకరణ 2018–19లో 95.83 శాతం ఉండగా 2019–20లో నూటికి నూరు శాతం సాధించింది.
► వ్యర్థాల నిర్వహణ 2018–19లో కేవలం ఏడు శాతమే ఉండగా 2019–20లో 48 శాతానికి పెరిగినట్లు నీతి ఆయోగ్‌ పేర్కొంది. 
► ఇకపోతే.. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు నూటికి నూరు శాతం బ్యాంకు ఖాతాలున్నాయని, పిల్లల్లో రక్తహీనతను తగ్గించడానికి చర్యలు మెరుగ్గా ఉన్నాయని, ఆస్పత్రుల్లో కాన్పులు పెరిగాయని, హత్యలు గతంతో పోల్చితే తక్కువగా ఉన్నాయని నీతి ఆయోగ్‌ వెల్లడించింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top