ఏవోబీలో రెడ్‌అలెర్ట్ | AOV Red Alert | Sakshi
Sakshi News home page

ఏవోబీలో రెడ్‌అలెర్ట్

Apr 11 2014 12:34 AM | Updated on Oct 9 2018 2:51 PM

ఏవోబీలో రెడ్‌అలెర్ట్ - Sakshi

ఏవోబీలో రెడ్‌అలెర్ట్

ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)ల్లో మావోయిస్టులు చెలరేగిపోయారు. కొద్ది రోజులుగా ప్రశాం తంగా ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా విరుచుకు పడ్డారు.

  •      సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు
  •      పి గంగవరంలో ఎన్నికల పోస్టర్లు చించివేత..?
  •      ఒడిశాలో సెల్‌టవర్, జీపు కాల్చివేత
  •       సమాచారంతో పోలీసుల అప్రమత్తం
  •  కొయ్యూరు/సీలేరు, న్యూస్‌లైన్: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)ల్లో మావోయిస్టులు చెలరేగిపోయారు. కొద్ది రోజులుగా ప్రశాం తంగా ఉన్న ప్రాంతంలో  ఒక్కసారిగా విరుచుకు పడ్డారు. ఎన్నికల వేళ తమ ఉనికిని చాటుకునేందుకు భారీ ప్రయత్నం చేశారు. దీంతో జిల్లా పోలీసు యంత్రాం గం రెడ్‌అలెర్ట్ ప్రకటించింది. ప్రశాంతంగా పోలింగ్ కోసం పోలీసులు నడుంబిగిస్తున్న సమయంలో విధ్వంసం సృష్టించడం యం త్రాంగానికి సవాలుగా మారింది.

    సరిహద్దులోని మల్కన్‌గిరి జిల్లా పలిమిల పోలీసు స్టేషన్ పరిధి మచిలి పంచాయతీ నోపడా గ్రామం వద్ద ఎన్నికల సిబ్బందిని సాయుధ మావోయిస్టులు అడ్డగించి జీపును కాల్చి ధ్వంసం చేశారు. అందులోని ఈవీఎంలను వెంట తీసుకుపోయారు. అదే సమయంలో భద్రాచలం ప్రాంతంలోని కూనవరం గ్రామంలో ఎయిర్‌టెల్ సెల్‌టవర్‌ను పేల్చివేశారు. దీంతో మావోయిస్టుల కంచుకోటగా పేరొందిన జీకేవీధి మండలం సీలేరు, దుప్పులవాడ, దారకొండ, గుమ్మరేవుల్లో పోలింగ్ ప్రశ్నార్థకంగా మారింది.

    ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. గ్రేహాండ్స్, స్పెషల్‌పార్టీ, సీఆర్‌పీఎఫ్ బలగాలతో అడవులను జల్లెడ పడుతున్నారు. గ్రామాల్లోకి వచ్చే కొత్త వ్యక్తుల గురించి ఆరాతీస్తున్నారు. ఎన్నికల వేళ ఏమి జరుగుతుందోనని గిరిజనులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. కాగా తూర్పు- విశాఖ సరిహద్దుల్లోనూ చాలా కాలం తరువాత దళసభ్యుల కదలికలు ప్రారంభమయ్యాయి.

    మంప పంచాయతీ రాళ్లగెడ్డ దొడ్డవరం, పి గంగవరం,టీటోరాళ్ల, తదితర గ్రామాలు తూర్పుగోదావరి జిల్లా వై రామవరం మండలాన్ని ఆనుకుని ఉన్నాయి. బుధవారం సుమారు 50 మంది మావోయిస్టులు పి. గంగవరం వచ్చి రాజకీయ పార్టీల వారు అంటించిన కరపత్రాలు,బ్యానర్లను పీకేసినట్టుగా తెలిసింది. పోలింగ్‌లో పాల్గొనరాదని అక్కడివారిని హెచ్చరించినట్టు భోగట్టా.

    ఆ గ్రామానికి  చెందిన కొందరిని తమ వెంట తీసుకెళ్లారు. ఇది తెలిసిన రెండు జిల్లాల పోలీసులు ఆ  ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. ఆర్.దొడ్డవరం నుంచి గొడుగులమ్మబంద మీదుగా కొండపైనుంచి నేరుగా మంప రావచ్చు. మావోయిస్టులు మంప పోలింగ్ కేంద్రంపై దాడులకు తెగబడే ప్రమాదముందని పోలీసులు అనుమానిస్తున్నారు.
     
    పోలీసులు అప్రమత్తం

    పాడేరు : స్థానిక ఎన్నికలతో మన్యంలో పెద్ద ఎత్తున కూంబింగ్ చేపడుతున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లోని మారుమూల గ్రామాల్లో ఎన్నడూ లేని విధంగా పోలీసులు భారీగా మోహరించారు. ఏజెన్సీ అంతటా భద్రతా బలగాల బూటు చప్పుళ్లు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో తిరుగుతూనే పోలింగ్‌కేంద్రాలకు అనుకుని ఉన్న కొండ ప్రాంతాల్లో పోలీసులు మాటు వేశారు.

    అనుక్షణం డేగకన్నుతో పర్యవేక్షిస్తున్నారు.  జి.మాడుగుల, పెదబయలు మండలాల సరిహద్దులోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అడుగడుగునా పోలీసులు ఉన్నారు. దీంతో ఆయా గ్రామాల్లోని గిరిజనులు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. గాలికొండ, జర్రెల, ఇంజరి, కిల్లంకోట, బొయితిలి, బొంగరం, జామిగుడ, కుడుమసారి, బూసిపుట్టు, కుమడ, రంగబయలు తదితర సెగ్మెంట్‌ల పరిధిలోని మారుమూల గ్రామాల గిరిజనులంతా స్థానిక ఎన్నికలతో బిక్కుబిక్కమంటూనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇటు మావోయిస్టుల హెచ్చరికలు, మరోవైపు పోలీసులు గాలింపు చర్యలతో మారుమూల గిరిజనులు భయపడుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement