మా మంత్రి కనిపించడం లేదు

Andhra Pradesh Panchayat Raj Employees Fire On Lokesh - Sakshi

నారా లోకేశ్‌పై పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ ఉద్యోగ సంఘాల మండిపాటు

హామీలపై స్పందించకుండా తప్పించుకుని తిరుగుతున్నారని ఆగ్రహం

సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆరు నెలల క్రితం తమకు పలు హామీలు ఇచ్చి ఇప్పటికీ నెరవేర్చలేదని, ముఖం కూడా చూపించకుండా తప్పించుకొని తిరుగుతున్నారని పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న 14 సమస్యలను పరిష్కారిస్తామని ఈ ఏడాది మార్చి 14వ తేదీన మంత్రి లోకేశ్, ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన సమావేశంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది.

మంత్రి లోకేశ్‌ సూచన మేరకు ఉద్యోగ సంఘాల నాయకులకు ఉన్నతాధికారులు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి ఆరు నెలలు దాటినా అందులో ఒక్కటీ నేరవేరలేదని ఉద్యోగా సంఘాల నేతలు అంటున్నారు. ఖాళీలను భర్తీ చేయకపోవడంతో పంచాయతీరాజ్‌ శాఖ ఇంజనీరింగ్‌ విభాగంలో ఏఈ స్థాయి ఇంజనీరింగ్‌ సిబ్బంది ఇప్పుడు ఒక్కొక్కరు ఒకేసారి 150 పనులను పర్యవేక్షించాల్సి వస్తోంది. పనిభారం వల్ల ఇంజనీరింగ్‌ అధికారులు ప్రతి పని వద్ద ఉండే పరిస్థితి లేకపోవడంతో దాదాపు 40 శాతం మంది ఉద్యోగులు ఏళ్ల తరబడి సస్పెన్షన్‌ కేసులు ఎదుర్కొవాల్సి వస్తోందని ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రికి చెప్పుకున్నారు. వర్క్‌ఇన్‌స్పెక్టర్ల స్థానంలో 1,900 మంది సైట్‌ ఇంజనీర్లను నియమిస్తామని మంత్రి లోకేశ్‌ హామీ ఇచ్చారు. 

లోకేశ్‌ ప్రతిపాదనను తిరస్కరించిన ఆర్థిక శాఖ
లోకేశ్‌ హామీ మేరకు 1,900 సైట్‌ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి సిఫార్సు చేస్తూ పంచాయతీరాజ్‌ శాఖ ముఖ కార్యదర్శి జవహార్‌రెడ్డి ఆర్థిక శాఖకు ప్రతిపాదన పంపారు. ఈ ప్రతిపాదనను ఆర్థిక శాఖ తిరస్కరించిందని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. దీనిగురించి మంత్రి లోకేశ్‌కు చెబుదామంటే ఆయన అందుబాటులోకి రావడం లేదని విమర్శిస్తున్నారు. అసలే పని ఒత్తిడిలో ఉన్న ఫీల్డు ఇంజనీరింగ్‌ అధికారులను జిల్లా కలెక్టర్లు వారానికి మూడు సార్లు వీడియో కాన్ఫరెన్స్‌ల పేరిట ఇబ్బందులు పెడుతున్నారని ఫిర్యాదు చేస్తే.. నెలకు ఒక్క మీటింగ్‌కే పరిమితం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని, కనీసం ఆ హామీని కూడా నేరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లోకేశ్‌కు విశ్వసనీయత ఏది?
హామీలు ఇచ్చి అమలు చేయకుండా విస్మరించిన మంత్రి లోకేశ్‌కు విశ్వసనీయత ఏముందని పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఆయన సచివాలయంలోని తన చాంబర్‌లో ఎప్పుడూ అందుబాటు ఉండరని చెబుతున్నారు.  
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top