కామాంధునిపై జనం దాడి | Andhra Mob Strips, Kicks Body of Alleged Child Rapist | Sakshi
Sakshi News home page

కామాంధునిపై జనం దాడి

Jun 20 2015 1:28 AM | Updated on Aug 21 2018 5:46 PM

ఏలూరులోని గన్‌బజార్ వద్ద సురేష్ మృతదేహాన్ని తన్నుతున్న స్థానికులు   (ఇన్‌సెట్‌లో) సురేష్ (ఫైల్ ఫొటో) - Sakshi

ఏలూరులోని గన్‌బజార్ వద్ద సురేష్ మృతదేహాన్ని తన్నుతున్న స్థానికులు (ఇన్‌సెట్‌లో) సురేష్ (ఫైల్ ఫొటో)

ఏలూరులో గురువారం అభం శుభం తెలియని ఏడేళ్ల చిన్నారిపై అకృత్యానికి ఒడిగట్టి.. ఆపై హత్య చేసి.. మృతదేహాన్ని ట్రంకుపెట్టెలో దాచిన నిందితుడు సురేష్‌ను ప్రజలు తరిమి తరిమి కొట్టారు.

నిందితుడు సురేష్‌ను తరిమి కొట్టిన జనం
* బ్రిడ్జి పైనుంచి దూకి.. తీవ్ర గాయాలతో మృతి
* అతడిది ఆత్మహత్యే: పోలీసులు

ఏలూరు అర్బన్: ఏలూరులో గురువారం అభం శుభం తెలియని ఏడేళ్ల చిన్నారిపై అకృత్యానికి ఒడిగట్టి.. ఆపై హత్య చేసి.. మృతదేహాన్ని ట్రంకుపెట్టెలో దాచిన నిందితుడు సురేష్‌ను ప్రజలు తరిమి తరిమి కొట్టారు. తప్పించుకుని పారిపోతూ ఓవర్ బ్రిడ్జి పైనుంచి రైల్వే ట్రాక్‌పైకి దూకిన నిందితుడు తీవ్ర గాయాల పాలై కొద్దిసేపటికే మృతి చెందాడు.

నిందితుడు సురేష్(40) పట్టుకునేందుకు శుక్రవారం పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో మాదేపల్లి గ్రామానికి చెందిన కొందరు యువకులు పాత బస్టాండ్ ప్రాంతంలో తచ్చాడుతున్న సురేష్‌ను గుర్తించి చితకబాదారు. వారి నుంచి తప్పించుకుని పారిపోతూ సమీపంలోని ఓవర్ బ్రిడ్జి పైనుంచి రైల్వే ట్రాక్‌పైకి దూకేశాడు. తీవ్రంగా గాయపడిన నిందితుడు కొద్దిసేపటికే మృతి చెందాడు.(పూర్తి కథనం)

ఇదే సమయంలో నిందితుడిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలనే డిమాండ్‌తో ఫైర్‌స్టేషన్ సెంటర్ వద్ద రాస్తారోకో చేస్తున్న చిన్నారి బంధువులు, మాదేపల్లి గ్రామస్తులు సురేష్ దొరికాడనే విషయం తెలుసుకుని రైల్వే ట్రాక్ ప్రాంతానికి చేరుకున్నారు. ఆగ్రహోదగ్రులైన కొందరు అతడి మృతదేహాన్ని కాళ్లతో తన్నడం మొదలుపెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని జనాన్ని వారించారు. సురేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతాన్ని డీఎస్పీ కేజీవీ సరిత పరిశీలించారు.
 
దేవుడే శిక్షించాడు: బాలిక తల్లి
‘నా బిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకున్న ఆ కిరాతకుడికి దేవుడే తగిన శిక్ష విధించాడు. దుర్మార్గానికి పాల్పడిన వాడిపై కేసులు పెట్టినా ఇలాంటి శిక్ష అమలయ్యేది కాదు. అందుకే దేవుడు ఇలా శిక్ష విధించాడు’ అని హత్యకు గురైన బాలిక తల్లి పేర్కొంది.
 
అతడిది ఆత్మహత్యే..
చిన్నారి అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన గనిగంటి సురేష్ శుక్రవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఏలూరు డీఎస్పీ కేజీవీ సరిత చెప్పారు. ప్రాథమిక విచారణ నిమిత్తం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement