ఆంధ్ర యాపిల్‌ను మార్కెట్లోకి తెస్తాం | Andhra Apple answered the market | Sakshi
Sakshi News home page

ఆంధ్ర యాపిల్‌ను మార్కెట్లోకి తెస్తాం

Dec 15 2013 1:01 AM | Updated on Aug 18 2018 4:35 PM

సిమ్లా యాపిల్ మాదిరిగా ఆంధ్ర యాపిల్‌ను మార్కెట్లోకి తేవడమే లక్ష్యంగా పరిశోధనలు చేస్తున్నట్టు హైదరాబాద్‌కు...

=మూడేళ్లలో పరిశోధన ఫలితాలు
 =శాస్త్రవేత్త డాక్టర్ రమేష్ అగర్వాల్
 =లంబసింగిలో స్థల పరిశీలన

 
చింతపల్లి, న్యూస్‌లైన్: సిమ్లా యాపిల్ మాదిరిగా ఆంధ్ర యాపిల్‌ను మార్కెట్లోకి తేవడమే లక్ష్యంగా పరిశోధనలు చేస్తున్నట్టు హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ సెల్యూలర్ మాలిక్యులర్ బయాలజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ రమేష్ అగర్వాల్ తెలిపారు. శాస్త్రవేత్తల బృందం చింతపల్లి మండలం లంబసింగి ప్రాంతంలో శనివా రం పర్యటించింది. అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఈ ప్రాంతంలో యాపిల్ సాగుపై పరిశోధనలు జరిపేందుకు స్థల పరిశీలన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (న్యూఢిల్లీ)ఆధ్వర్యంలో చింతపల్లి ప్రాంతంలో యాపిల్ సాగుపై పరిశోధనలు చేస్తామన్నారు. ప్రస్తుతం మన దేశంలో జమ్ముకాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో యాపిల్‌ను వాణిజ్య పరంగా సాగు చేస్తున్నారని చెప్పారు. సముద్ర మట్టానికి 3,800 అడుగుల ఎత్తులో ఉన్న లంబసింగి ప్రాంతంలో జీరో డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఇక్కడ ప్రయోగాత్మకంగా యాపిల్ సాగు చేపట్టేందుకు నిర్ణయించామన్నారు.

సోలాన్‌లోని వై.ఎస్.ప్రమార్ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి కొన్ని రకాల యాపిల్ విత్తనాలను తెచ్చి జనవరి, ఫిబ్రవరి నెలల్లో ప్రయోగాత్మక సాగు చేపట్టనున్నట్టు తెలిపారు. ఇందుకు లంబసింగి సమీపంలోని రాజుపాకలు, చింతపల్లి ప్రాంతీయ పరిశోధన స్థానాల్లో యాపిల్ మొక్కలు నాటుతామన్నారు. మూడు, నాలుగేళ్లలో పరిశోధన ఫలితాలు నిర్ధారణ అవుతాయని చెప్పారు.

పరిశోధనలు విజయవంతమైతే అరకు, అనంతగిరి ప్రాంతాల్లో కూడా పరిశోధనలు జరుపుతామని, తర్వాత సాగుకు ప్రభుత్వ పరంగా రైతులను ప్రోత్సహించే చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఫర్ సెల్యూలర్ మాలిక్యులర్ బయాలజీ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్టు డాక్టర్ వీరభద్రరావు, సీనియర్ ఎస్‌ఈ వై.వి.రామారావు, స్థానిక పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ వేణుగోపాలరావు, శాస్త్రవేత్త ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement