పొత్తు చిచ్చు | alliance fire | Sakshi
Sakshi News home page

పొత్తు చిచ్చు

Apr 4 2014 12:48 AM | Updated on Sep 2 2017 5:32 AM

పొత్తు చిచ్చు

పొత్తు చిచ్చు

ఎవరికి ఏ సీటు వస్తుందో.. ఎక్కడి నుంచి పోటీ చేయాలో.. అసలు సీటు వస్తుందో లేదో అని తెలుగుదేశం పార్టీ ఆశావహులు ఇప్పటికే మదనపడుతున్నారు.

సాక్షి, ఏలూరు : ఎవరికి ఏ సీటు వస్తుందో.. ఎక్కడి నుంచి పోటీ చేయాలో.. అసలు సీటు వస్తుందో లేదో అని తెలుగుదేశం పార్టీ ఆశావహులు ఇప్పటికే  మదనపడుతున్నారు. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే యోచనలో టీడీపీ అధిష్టానం ఉండటం వారిని కలవరపరుస్తోంది.
 
తమ సీట్లు ఎక్కడ గల్లంతవుతాయోననే భయం తెలుగు తమ్ముళ్లకు పట్టుకుంది. పొత్తుల నేపథ్యంలో బీజేపీ జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాలు, ఒక లోకసభ స్థానాన్ని కోరుతున్నట్లు సమాచారం. అదే జరిగితే పదవుల కోసం పార్టీలు మారిన వారి అంచనాలు తలకిందులయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో గందరగోళం నెలకొంది. ఓ వైపు ఎవరినిబడితే వారిని పార్టీలోకి ఆహ్వానించి సొంత వాళ్లకు పొగబెట్టడంతోపాటు పార్టీలో చేరిన వాళ్లనూ వంచించే ప్రయత్నాలు మొదలయ్యాయి.
 
దీంతో నిత్య అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ నేతలు పైకి మాత్రం నిన్నటివరకూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. పార్టీ అబాసు పాలవుకుండా కాపుకాశారు. కానీ అధిష్టానం పొత్తుల వైపు చూడటం నాయకుల రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకం చేస్తోంది. నమ్మినవారిని వంచించడం తమ అధినేతకు వెన్నతో పెట్టిన విద్య అని తెలిసినప్పటికీ ఇన్నాళ్లూ ఆయననే నమ్ముకున్న వాళ్లు బీజేపీ పొత్తు నిర్ణయంతో కొత్త చిక్కుల్లో పడ్డారు. నిన్నమొన్నటి వరకూ సీటు తమదేననే ధీమాతో ఉన్న వారు సైతం తాజా పరిణామాలతో తలలు పట్టుకుంటున్నారు. తమ స్థానాన్ని వేరే వాళ్లతో భర్తీ చేస్తే ఇక సహించేది లేదని తెగేసి చెబుతున్నారు.
 
ఏలూరు అసెంబ్లీ స్థానం బడేటి కోట రామారావుకు ఖరారైనట్టే. లోక్‌సభ స్థానం నుంచి మాగంటి బాబు బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీకి ఏలూరులో ఏ సీటు ఇవ్వాలన్నా సమస్య  జఠిలమవుతుంది. కోటగిరి శ్రీధర్ లోక్‌సభా స్థానం పోటీకి మొగ్గుచూపుతున్నారు. దీంతో మాగంటి బాబుకు కంటిమీద కునుకు కరువైందని ఆయన సన్నిహితులు అంటున్నారు. తాడేపల్లిగూడెం మరింత సమస్యాత్మకం కానుంది. ఇక్కడ ఇప్పటికే కొట్టు సత్యనారాయణ, ఈలి నాని టీడీపీలో చేరి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
 
ఆ సీటును బీజేపీ అభ్యర్థి మాణిక్యాలరావు తన్నుకుపోతే వారి గతి అధోగతే. కొవ్వూరులో తనను మించిన నాయకుడు టీడీపీలో లేరని చెప్పుకునే టీవీ రామారావు సీటుకు బీజేపీ ఎసరు పెడుతోంది. ఆ స్థానం నుంచి ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ పి.శ్రీనివాస్ కంటే బి.బెనర్జీకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. పొత్తులో భాగంగా బెనర్జీకి సీటిస్తే రామారావు దుకాణం మూసేయాల్సిందే.
 
అసలే లేనిపోని వివాదాలతో ఇప్పటికే అటు ప్రజల్లో, ఇటు పార్టీలోనూ వ్యతిరేకత తెచ్చుకున్న ఆయనకు టీడీపీ టికెట్ దక్కే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆయన కలవర పడుతున్నారు. ఇలా ప్రతిచోటా టీడీపీలో ఇప్పుడు బీజేపీ పొత్తు చిచ్చు రేపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement