సీఎం జగన్‌ స్ఫూర్తితో నేనున్నానని...

Alla Nani Helped To Kidney Patient In Anakapalle, Visakapatnam - Sakshi

పేద కుటుంబానికి డిప్యూటీ సీఎం నాని అండ

రెండు కిడ్నీలు పోయిన బాలుడికి ఉచిత వైద్యసేవలకు అదేశాలు

అంతకుముందు ఆరోగ్యశ్రీ వర్తించదన్న ప్రైవేట్‌ ఆస్పత్రిపై ఆగ్రహం

సాక్షి, విశాఖపట్నం: ఆర్థిక కారణాలతో ఏ ఒక్కరు కూడా సరైన వైద్యం అందక మృతి చెందకూడదు. ప్రతిపేదవాడికీ నాణ్యమైన వైద్యం అందాలి.. అని నాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్‌రాజశేఖరరెడ్డి ఆకాంక్షించారు. ఆ ఉదాత్త ఆశయంతోనే ఆరోగ్యశ్రీ పథకానికి రూపకల్పన చేశారు. దాన్ని తన మానస పుత్రికగా భావించి పక్కాగా అమలు చేశారు. పేదల గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారు.

నాడు నాన్న వేసిన బాటలోనే.. 
నేటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నడుస్తున్నారు. గత కొన్నేళ్లుగా అనాథగా మారిన ఆరోగ్యశ్రీని పొదివి పట్టుకొని.. మళ్లీ ఆర్తుల చెంతకు చేరుస్తున్నారు. ఇదే ఆశయ స్ఫూర్తిని విశాఖ నుంచే చాటిచెప్పారు. పదిరోజుల కిందట శారదాపీఠం సందర్శనకు వచ్చిన సందర్భంలో విమానాశ్రయంలో బ్లడ్‌ క్యాన్సర్‌తో ప్రాణాపాయంలో ఉన్న తోటి విద్యార్ధి నీరజ్‌ కోసం స్నేహితులు చేపట్టిన ఆందోళన చూసి చలించిన సీఎం జగన్‌ వెంటనే తన కార్యదర్శి, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వైద్యసాయానికి చర్యలు తీసుకున్న సంగతి అందరికీ తెలుసు.. ఇప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌ బాటలోనే.. ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకుంటున్నారు.. డిఫ్యూటీ సీఎం, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని). 

రెండు కిడ్నీలు పాడై ఆర్ధిక బాధలతో చికిత్స కోసం అల్లాడిపోతున్న ధనోజ్‌కు బాసటగా నిలిచారు. ధనోజ్‌ దయనీయస్థితిపై నాలుగురోజుల కిందట సాక్షిలో వచ్చిన కథనంతో పాటు కుటుంబసభ్యులు పంపిన వాట్సాప్‌ మెసేజ్‌ను చూసి స్పందించిన ఆయన వారిని తనవద్దకు పిలిపించుకున్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రి నిర్వాకంతో డబ్బుల కోసం నిన్నటి వరకు దాతల సాయం ఆశించిన ఆ కుటుంబానికి ఇప్పుడు ఏకంగా సర్కారు అండ దొరికింది. ఎంత ఖర్చయినా సరే మొత్తం బాధ్యత ప్రభుత్వానిదేనని డిఫ్యూటీ సీఎం నాని భరోసా ఇచ్చారు. మెరుగైన వైద్యం కోసం మైక్యూర్‌ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించారు. ఒక్క వాట్సాప్‌ మెసేజ్‌తోనే ఆదరణ చూపిన డిఫ్యూటీ సీఎం నాని రుణం తీర్చలేనిదంటూ ధనోజ్‌ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురవుతున్నారు.

విశాఖలో కార్పొరేట్‌ ఆస్పత్రులు ఆరోపణల్లో చిక్కుకుంటున్నాయి. ఏవేవో కారణాలు చూపుతూ, నిబంధనలకు నీళ్లొదులుతూ రోగులను నిలువునా దోచుకుంటున్నాయి. విశాఖలో ఆర్కే ఓమ్నీలో జరిగిన వ్యవహారం ఇప్పుడు కార్పొరేట్‌ ఆస్పత్రుల కాసుల కాంక్షకు దర్పణం పడుతోంది. రెండు కిడ్నీలు చెడిపోయిన ఓ పేద బాలుడికి ఆరోగ్యశ్రీ వర్తించదని రూ.70 వేలు వసూలు చేయడం, వైద్య పరీక్షలకు మరో రూ.60 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేయడం పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఆటో నడుపుకుని బతుకీడుస్తున్న ఆ కుటుంబం అంత సొమ్ము చెల్లించుకోలేక వైద్యారోగ్యశాఖ మంత్రికి ఫిర్యాదు చేయడంతో దిగివచ్చి ఆరోగ్యశ్రీలో ఇప్పుడు వైద్యం అందిస్తోంది. ఇలా విశాఖలో పేద, మధ్య తరగతి రోగుల నుంచి రూ.లక్షల్లో కార్పొరేట్‌ ఆస్పత్రులు దోపిడీ చేస్తూనే ఉన్నాయి. అయితే ఇలాంటివి అరుదుగానే వెలుగు చూస్తున్నాయి.

తాజాగా అనకాపల్లి మండలం రేబాకకు చెందిన ఆటో డ్రైవర్‌ ముమ్మన సత్తిబాబు కుమారుడు ధనోజ్‌ (9)కు రెండు కిడ్నీలు పాడై పోయాయి. రెండు నెలల క్రితం ధనోజ్‌తో పాటు అతని సోదరుడు డెంగ్యూ జ్వరం బారినపడ్డారు. తొలుత వీరిని అనకాపల్లి ప్రయివేటు ఆస్పత్రిలో చేర్చినా నయం కాకపోవడంతో ఇదే ఓమ్ని ఆర్కే ఆస్పత్రిలో వైద్యం చేయించారు. అప్పట్లో ఇద్దరికీ రూ.1.50 లక్షలు బిల్లు చెల్లించారు. ఇటీవల ధనోజ్‌ ఫిట్స్‌తో పడిపోవడంతో తొలుత అనకాపల్లి ఆస్పత్రిలోనే చేర్చారు. అక్కడ వైద్యులు ఈనెల 9న విశాఖలోని ఓమ్ని ఆర్కే ఆస్పత్రికి పంపారు.

పరీక్షలు నిర్వహించిన వైద్యులు బాబుకు రెండు కిడ్నీలు చెడిపోయాయని, బతకాలంటే లక్షల్లో ఖర్చవుతుందని కుటుంబ సభ్యులకు చెప్పారు. ఆటో నడుపుకుని బతికే తాము అంత ఖర్చును భరించలేమని ఆరోగ్యశ్రీలో వైద్యం చేయాలని కోరారు. ధనుష్‌ రోగం ఆరోగ్యశ్రీ కిందికి రాదని చెప్పి దశల వారీగా రూ.70 వేలు కట్టించుకున్నారు. వైద్య పరీక్షలకు మరో రూ.60 వేలు ఖర్చవుతుందని చెప్పారు. ఈ కుటుంబ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఈనెల 13న ‘సాక్షి’ ‘పేదింటి బిడ్డకు పెద్ద కష్టం’ శీర్షికతో కథనాన్ని ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో తమ బిడ్డను ఎలాగైనా బతికించుకోవాలన్న భావనతో కుటుంబ సభ్యులు వాట్సాప్‌ ద్వారా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నానికి ధనోజ్‌ పరిస్థితిని తెలియజేశారు.

రూరల్‌ ఆస్పత్రులతో కార్పొరేట్‌కు లింకులు 
ఇక నగరంలోని కార్పొరేట్, ప్రయివేటు ఆస్పత్రులకు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న ఆస్పత్రులతో లింకులున్నాయి. తమ వద్దకు వచ్చిన రోగులను నేరుగా విశాఖలోని ఫలానా ఆస్పత్రికి వెళ్లండంటూ పంపిస్తున్నారు. ఈ కేసుల నుంచి వచ్చే సొమ్ములో కొంత సొమ్మును పంపిన ఆస్పత్రులకు ఇస్తుంటారు. ఇదొక వ్యాపారంగా మారింది. ఉదాహరణకు ధనోజ్, అతని సోదరుడు రెండు నెలల క్రితం డెంగ్యూ జ్వరంతో అనకాపల్లిలోని లండన్‌ ఆస్పత్రిలో చేరారు. అక్కడ నయం కాకపోవడంతో ఓమ్నీ ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. ఇప్పుడు కిడ్నీ జబ్బుతో ఉన్న ధనోజ్‌ను ఓమ్నీకి మళ్లీ రిఫర్‌ చేసింది కూడా లండన్‌ ఆస్పత్రే. ఇలా జిల్లాలోను, నగరంలోనూ పలు ఆస్పత్రులకు ఎన్నో వ్యాపార లింకులున్నాయి. ఇదే ఇప్పుడు ఆయా హాస్పిటళ్లకు కాసులు కురిపిస్తున్నాయి.

మంత్రి నాని మానవత్వం
తక్షణమే స్పందించిన మంత్రి వైద్య రికార్డులతో తన వద్దకు రమ్మని స్వయంగా ఫోన్‌ చేసి చెప్పారు. అంతేకాదు..ఆరోగ్యశ్రీకి అర్హత ఉన్నా అందులో చేర్చకపోవడంపై ఆస్పత్రి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు చెల్లించిన సొమ్ము తిరిగివ్వాలని, ఆరోగ్యశ్రీలో ఉచితంగా ధనోజ్‌కు వైద్యం అందించాలని ఆదేశించారు. కార్పొరేట్‌/ప్రయివేటు ఆస్పత్రుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మంత్రి ఆదేశాలతో ఆగమేఘాలపై ఓమ్ని ఆర్కే ఆస్పత్రికి చేరుకున్న వైద్యారోగ్యశాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. మంత్రి సూచనలతో ధనోజ్‌కు మెరుగైన వైద్యం అందించడానికి మంగళవారం ఉదయం నగరంలోని మైక్యూర్‌ ఆస్పత్రికి తరలిస్తున్నారు. వైద్యం ఖర్చుపై ఆందోళన చెందవద్దని, ఆ సొమ్మును ప్రభుత్వం భరిస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు.

రూ. కోట్లలో బకాయిలు 
ఇన్నాళ్లూ ప్రయివేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులకు కోట్లలో పేరుకుపోయిన బకాయిలను గత ప్రభుత్వం చెల్లించడం మానేసింది. దీంతో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందజేస్తే బకాయిలు ఆలస్యంగా వస్తాయన్న ఉద్దేశంతో ఆయా ఆస్పత్రులు ఏవేవో వంకలు పెట్టి తిరస్కరిస్తున్నాయి. ప్రాణాపాయంలో ఉన్న రోగి కుటుంబ సభ్యులు అప్పులు చేసి, ఆస్తులమ్ముకుని నగదు చెల్లించి వైద్యం చేయిస్తున్నారు. ఇలాంటి కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి పోవడానికి ఇదో కారణమని చెబుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top