
సాక్షి, అమరావతి: అసెంబ్లీ మినహా రాజధాని భవనాల డిజైన్లన్నీ ఖరారయ్యాయని సీఎం చంద్రబాబునాయుడు వెల్లడించారు. సంక్రాంతికి అటు ఇటుగా రాజధానిలో ప్రభుత్వ శాశ్వత భవనాల నిర్మాణ పనులను ప్రారంభిస్తామని చెప్పారు. విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్న ఆయన శుక్రవారం రాత్రి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. రాజధాని డిజైన్ల రూపకల్పనలో సినీ దర్శకుడు రాజమౌళి విలువైన సూచనలు చేశారన్నారు. డిజైన్ల ఖరారులో ఆయన కీలకంగా వ్యవహరించారని చెప్పారు. మరో 40 రోజుల్లో అసెంబ్లీ భవన డిజైన్‌నూ ఖరారు చేస్తామని తెలిపారు. ప్రపంచంలో అత్యుత్తమ సచివాలయం, అత్యున్నత పరిపాలన నగరాల డిజైన్లు మనవే అవుతాయని చెప్పారు.