హైవే.. నోవే!


► జాతీయ, రాష్ట్ర రహదారులకు దూరంగా మద్యం షాపులు 

► ఏ మద్యం షాపైనా 500 మీటర్ల దూరంలో ఉండాల్సిందే

► మద్యం షాపులపై కొరడా ఝుళిపించిన సుప్రీంకోర్టు  మార్కాపురం ప్రాంతంలో

► 144 షాపులకు ముప్పు ఆందోళనలో మద్యం వ్యాపారులు

మార్కాపురం: రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా సుప్రీంకోర్టు మద్యం షాపులపై కొరడా ఝుళిపించింది. గతేడాది నవంబర్‌లో ఇచ్చిన తీర్పును ఈ నెల 31వ తేదీలోపు అమలు చేయాలని ఎక్సైజ్‌ అధికారులను ఆదేశించటంతో ఒక్కసారిగా మద్యం షాపుల యజమానుల్లో ఆందోళన మొదలైంది.

 

జాతీయ, రాష్ట్ర రహదారికి 500 మీటర్ల దూరంలో మాత్రమే మద్యం షాపులు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మార్కాపురం ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పరిధిలో మార్కాపురం, కంభం, యర్రగొండపాలెం, కనిగిరి, కందుకూరు, సింగరాయకొండ, గిద్దలూరు, దర్శి, పొదిలిలో ఎక్సైజ్‌ పోలీసుస్టేషన్‌లు ఉన్నాయి. వీటి పరిధిలో 169 వైన్‌షాపులు నడుస్తున్నాయి.

 

సమీపించిన గడువు

సుప్రీంకోర్టు్ట ఆదేశాలతో ప్రస్తుతం రోడ్డుకు దగ్గరలో ఉన్న (సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం) 144 షాపులను జనవాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని ఎక్సైజ్‌ అధికారులు నిర్ణయించారు. మూడు రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా మద్యం షాపుల యజమానులతో మాట్లాడుతున్నారు. షాపులను అత్యవసరంగా తొలగించాలని ఆదేశించడంతో వ్యాపారులు కలవరపాటుకు గురవుతున్నారు. ఈ నిబంధనల ప్రకారం ప్రతి మండల కేంద్రం రాష్ట్ర, లేదా జాతీయ రహదారికి అనుబంధంగా ఉంది. ఇప్పటి వరకూ ఎక్సైజ్‌ అధికారులు గుడికి, బడికి 100 మీటర్ల దూరం ఉంటే చాలనే నిబంధన ప్రకారం 2015లో మద్యం షాపులకు లైసె¯Œ్సలు ఇచ్చారు. తాజా నిబంధనలతో పరిస్థితి తారుమారైంది. మార్కాపురం పట్టణంలో 13, దర్శిలో 7, తాళ్లూరులో 4, రాజంపల్లిలో 1, పొదిలిలో 6, దొనకొండలో 3, దోర్నాలలో 3, కంభంలో 5 మద్యం షాపులను రాష్ట్ర రహదారికి దూరంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 31లోపు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. 2015లో మద్యం షాపులు దక్కించుకున్న యజమానులు ఏటా ప్రభుత్వానికి షాపు ఆధారంగా రూ.30 నుంచి రూ.45 లక్షల వరకు లైసెన్స్‌ ఫీజు కింద చెల్లిస్తున్నారు.

 

మార్కాపురం సూపరింటెండెంట్‌ పరిధిలో ఏటా 60 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఒంగోలు సర్కిల్‌ నుంచి సుమారు 54 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం తిరునాళ్ల సీజన్‌. ప్రభుత్వ నిబంధనలు అమలు చేస్తే మద్యం షాపులన్నీ ఊరికి దూరంగా ఉంటాయి. తిరునాళ్లకు మద్యం తాగేందుకు శివారు ప్రాంతాలకు ఎవరొస్తారని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. దోర్నాల, మార్కాపురం, పెద్దారవీడు, త్రిపురాంతకం, కంభం, పొదిలి, దర్శి, కనిగిరి పట్టణాల మీదుగా పలు రాష్ట్ర, జాతీయ రహదారులున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పట్టణంలో ఉన్న షాపులను కూడా ఊరి బయటకు తరలించాలి్సన పరిస్థితి ఏర్పడింది.

 

సుప్రీం తీర్పు పాటించాల్సిందే

ఈ నెల 31వ తేదీలోపు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర, జాతీయ రహదారి పక్కన ఉన్న మద్యం దుకాణాలు తొలగిస్తాం. ఇక నుంచి వ్యాపారులు సుమారు 500 మీటర్ల దూరంలో మద్యం షాపులు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. నిబంధనలకు వ్యతిరేకంగా యజమానులు వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. 

ఆర్‌.హనుమంతురావు, 

ఎక్సైజ్‌ సూపరింటెండెంట్, మార్కాపురం.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top