
సాక్షి, హైదరాబాద్: రాజంపేట శాసనసభ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయంలో పార్టీ అధిష్టానవర్గం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి స్పష్టం చేశారు. కడప జిల్లా నేతలు పలువురు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమైన అనంతరం ఆకేపాటి జగన్ నివాసం బయట మీడియాతో మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ ప్రస్తుత రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్‌రెడ్డి వైఎస్సార్ సీపీలో చేరడం వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదని తామంతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరమని అమరనాథరెడ్డి అన్నారు.
జగన్ వద్ద టికెట్ల విషయం చర్చించలేదని ఈ విషయమై అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానన్నారు. ఒకవేళ మేడాకు టికెట్ ఇస్తే మీరు మద్దతు ఇస్తారా? అని ప్రశ్నించగా..‘ఒకరికి మద్దతు అనేది ఇక్కడ అంశం కాదు.. నామద్దతు ఎల్లప్పుడూ జగన్‌కే..’ అని స్పష్టం చేశారు.