ఏమి'టీ'దారుణం

Adulterated Tea Powder Sales In West Godavari - Sakshi

జిల్లాలో యథేచ్ఛగా కల్తీ టీపొడి విక్రయాలు

ప్రజారోగ్యంతో చెలగాటం

దాడులతో బయటపడుతున్న వైనం

కాలేయం, కంటిచూపు దెబ్బతినే ప్రమాదం

పశ్చిమగోదావరి, ఏలూరు (మెట్రో) : ఉదయాన్నే లేవగానే టీ తాగడం అనేది చాలామందికి ఉన్న ఓ అలవాటు.. అధికశాతం మంది ఇళ్లలో కంటే బయటే దుకాణా ల్లో టీ ఎక్కువగా తాగుతుంటారు. పనిఒత్తిడి మీద ఉన్నవారు అయితే వెంట, వెంటనే టీ తాగుతుంటారు. మానవ జీవితంతో విడదీయలేనంతగా ఈ అలవాటు కొందరితో పెనవేసుకుంది. ఇదే ఆసరాగా కొందరు స్వార్థపరులు లాభాలే ధ్యేయంగా ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. రంగు ఎక్కువగా కనిపించేందుకు గాను టీ పొడి కల్తీలకు పాల్పడుతున్నారు. ప్రజారోగ్యానికి హానికరం చేసే పదార్థాలు కలుపుతున్నారు.

జీడిపిక్కల పొడి వినియోగం
జిల్లాలోని తణుకు, ఏలూరు, తాడేపల్లిగూడెం వంటి ప్రాంతాల్లో టీ దుకాణాల్లో కల్తీ టీపొడి వినియోగించడంతో పాటు విక్రయిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో పాటు చెలగాటమాడుతున్నారు. ప్రధానంగా రంగు కోసం జీడిపిక్కల పొడి, ఒకసారి వినియోగించేసిన పొడి, రసాయనాలు కలుపుతున్నట్టు ఆహార తనిఖీ అధికారులు ఇటీవల దాడుల్లో గుర్తించారు. విజిలెన్స్‌ అధికారుల దాడుల్లోనూ ఇవి బయటపడుతున్నాయి. అయినప్పటికీ ఈ దందా గుట్టుచప్పుడు కాకుండా సాగుతూనే ఉంది. ఇవి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా జిల్లాకు దిగుమతి చేసుకుంటూ వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. బహిరంగ మార్కెట్‌లో కొన్ని బ్రాండెడ్‌ కంపెనీలకు సంబంధించిన టీపొడి కిలో రూ.600 పలుకుతుంది. అయితే అదే మొత్తంలో నకిలీది అయితే రూ.300లకే లభ్యం అవుతోంది. ధర తక్కువ కారణంగా తమ దుకాణాల్లో ఈ కల్తీ టీ పొడిని విక్రయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న దుకాణాల ద్వారా సుమారు రోజుకు 8 వేల కిలోల టీపొడిని విక్రయిస్తున్నట్టు అంచనా. దీంతో పాటుగా రోజురోజుకూ టీ తాగేవారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రతి వీధిలోనూ విక్రయించే దుకాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.

ఇవిగో ఉదాహరణలు
గత నెలలో జిల్లా కేంద్రమైన ఏలూరులో తమరాల శ్రీను అనే వ్యక్తి వద్ద నుంచి 845 కిలోల నకిలీ టీ పొడిని విజిలెన్స్‌ అధికారులు దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. ఇదే వ్యక్తి గతేడాది కూడా వందల కిలోల నకిలీ టీపొడిని తయారు చేస్తూ పట్టుబడ్డాడు. అదే విధంగా తణుకులో కల్తీ నెయ్యి తయారు చేస్తూ, పామాయిల్‌ ప్యాకెట్లలో వేరుశనగ నూనెలు నింపుతూ ప్రతిదీ కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు.

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
ఆహార ప్రమాణాల చట్టం 2011లోని 3, 1, 2 (6) ప్రకారం టీ పొడిలో హానికరమైన టార్టాజిన్, సన్‌సెట్‌ ఎల్లో రంగులు కలవడం నిషేధం. వీటిని వినియోగిస్తే అన్నవాహికల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కొన్నిసార్లు కేన్సర్‌ సోకే అవకాశమూ ఉంది. కాలేయం, కంటిచూపు దెబ్బతినే ప్రమాదం ఉంది.

అడ్డుకునేందుకు చర్యలు శూన్యం
ఎన్నిసార్లు విజిలెన్స్‌ అధికారులు దాడులు చేస్తున్నా ఈ కేసులు సాధారణమైనవి కావడంతో వ్యాపారులు కల్తీ కొనసాగిస్తున్నారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే రసాయనాలను కలిపి విక్రయించే దుకాణాలతో పాటు వాటి యజమానులపై కఠిన చర్యలు చేపట్టాల్సి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top