‘పోలీస్‌ దాదా’పై విచారణకు ఆదేశం

అడిషనల్‌ ఎస్పీ వెంకటరమణకు విచారణ బాధ్యతలు

‘సాక్షి’ వరుస కథనాలపై స్పందించిన జిల్లా ఎస్పీ పాలరాజు

ఎస్‌.కోట సర్కిల్‌లో అవినీతి ఆరోపణలతో పలువురిపై వేటు

సాక్షిప్రతినిధి, విజయనగరం: ఎస్‌.కోట సర్కిల్‌ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ పోలీస్‌ అధికారి ఏడాదిన్నర కాలంగా సాగిస్తున్న అవినీతి దందాపై ‘పోలీస్‌ దాదా, తవ్వేకొద్దీ వెలుగులోకి, మూర్తీ భవించిన అవినీతి’ శీర్షికలతో ‘సాక్షి’లో ప్రచురించిన వరుస కథనాలు జిల్లా పోలీస్‌ శాఖను కుదిపేశాయి. అధికారి దందాలపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. సాక్ష్యాధారాలతో పాటు బాధితుల వాంగ్మూలతో సహా బయటపెట్టడంతో ఉన్నతాధికారులు చలిం చారు. విచారణ నివేదిక రూపొందించి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

 పత్రికలో వచ్చిన కథనాలు ఆధారంగా మరిన్ని వివరాలు సేకరించాల్సిందిగా అడిషనల్‌ ఎస్పీ అట్టాడ వెంకటరమణను ఆదేశించినట్టు ఎస్పీ పాలరాజు స్వయంగా ‘సాక్షి’కి వెల్లడించారు.  రెండు, మూడు రోజుల్లో పూర్తి నివేదిక తయారు చేసి ఆ అధికారిపై చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే అవినీతి ఆరోపణల కారణంగా కొందరు సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. ఎస్‌.కోట సర్కిల్‌లో దందాలపై ‘సాక్షి’ చెప్పింది అక్షరాల వాస్తవమని ఎస్పీ అన్నారు.

 ఇప్పటికే ఈ సర్కిల్‌లో అవినీతి ఆరోపణల కారణంగా ఎస్‌ఐను హెడ్‌క్వార్టర్‌కు పిలిపించగా, ముగ్గురు కానిస్టేబుళ్లను ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌కు అటాచ్‌ చేశామని వివరించారు. తాజాగా సర్కిల్‌ అధికారిపై ఆరోపణలు రావడంతో అతనిపై బహిరంగ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ‘సాక్షి’ కథనాలతో ఎస్‌.కోట సర్కిల్‌  పోలీసులో కదలిక కనిపించింది. ఎన్ని అక్రమ వ్యాపా రాలు సాగుతున్నా కేసుల నమోదుకు ముందుకు రాని వారు ఆదివారం పశు అక్రమ రవాణాపై నిఘా పెంచారు. కేసులు నమోదుచేసి పనిచేస్తున్నామ నిపించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top