ఇక్కడ కష్టం ‘గురు’ | Accommodations Shortage In Gurukul School East Godavari | Sakshi
Sakshi News home page

ఇక్కడ కష్టం ‘గురు’

Jun 30 2018 6:24 AM | Updated on Apr 3 2019 8:07 PM

Accommodations Shortage In Gurukul School East Godavari - Sakshi

బాత్‌రూముల్లో నీరు రాక చేతి పంపు వద్ద స్నానాలు చేస్తున్న విద్యార్థులు

ఉత్తమ విద్యనందించేందుకు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్టు  ప్రభుత్వం చెప్పుకుంటోంది. అయితే వాటిలో సౌకర్యాల విషయాన్ని ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. దాంతో విద్యార్థులకు కష్టాలతో సహజీవనం తప్పడం లేదు. నరేంద్రపురం గురుకుల పాఠశాల దానికి ఓ ఉదాహరణగా నిలుస్తోంది.

పి.గన్నవరం: విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్టు చెప్పుకొనే ప్రభుత్వం, విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఘోరంగా విఫలమవుతోంది. పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. అన్న చందంగా నరేంద్రపురం ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల తయారైంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తోంది. నరేంద్రపురం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను రూ. 13 కోట్లతో నిర్మించారు. రెండేళ్ల క్రితం ఈపాఠశాల ప్రారంభోత్సవ సభలో అప్పటి సాంఘికసంక్షేమ శాఖ మంత్రి ఇందులో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నట్టు హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ గాలిలో కలిసిపోయింది. దాంతో ఆది నుంచి ఇక్కడ సమస్యలతో విద్యార్థులు సమతమవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.  ఈ పాఠశాలలో ప్రస్తుతం ఐదో తరగతి నుంచి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ వరకూ సుమారు 600 మంది విద్యార్థులు చదువుతున్నారు. తరగతి గదుల్లో బెంచీలు లేవు. అలాగే పడక గదుల్లో మంచాలు, పరుపులు లేవు.

దాంతో వారు కిందనే నిద్రిస్తున్నారు. జనరేటర్‌ సౌకర్యం లేకపోవడంతో రాత్రి వేళల్లో కరెంటు పోతే చీకటి రాజ్యమేలుతోంది. పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మించలేదు. దీంతో పాఠశాల ఆవరణలో విష సర్పాలు సంచరిస్తున్నాయి. గతంలో ఒక విద్యార్థి స్కూలు బ్యాగ్‌లో కట్లపాము దూరి అతడిని కాటేసింది. అదృష్టవశాత్తూ అతను ప్రాణాపాయం నుంచి గట్టెక్కాడు. పాఠశాల ఆవరణను మెరక చేయకపోవడంతో ఆటస్థలం లేక తుప్పల్లోనే విద్యార్థులు ఆటలు ఆడుకుంటున్నారు. పాఠశాల ఆవరణలో సీసీ రోడ్లు లేకపోవడంతో వర్షం వస్తే విద్యార్థుల రాకపోకలతో తరగతి గదులు బురదమయం అవుతున్నాయి. మూడు నెలలుగా ఆర్వో ప్లాంటు పనిచేయడం లేదు. దీంతో మంచినీటి టిన్నులను కొనుగోలు చేస్తున్నారు. నరేంద్రపురం– అవిడి రోడ్డు నుంచి ఈ పాఠశాల వరకూ కిలోమీటరు మేర గ్రావెల్‌ రోడ్డు వేశారు. అది పాడై పోవడంతో వర్షం వస్తే రహదారి బురదమయం అవుతోంది. ఆ సమయంలో పాఠశాలకు మంచినీరు కూడా సరఫరా కావడం లేదు. 

స్నానాలు చేసేందుకూ ఇబ్బందులే..
పాఠశాలలో బోరు సక్రమంగా లేక త్రీ ఫేజ్‌ వాటర్‌ మోటారు పనిచేయడం లేదు. దీంతో సింగిల్‌ ఫేజ్‌ మోటారుపైనే నీటికోసం ఆధార పడ్డారు. నరేంద్రపురంలో విద్యుత్‌ కోత ఎక్కువగా ఉంటోంది. దీంతో స్నానాలకు నీరులేక నానా పాట్లు పడుతున్నారు. కొందరు విద్యార్థులు రెండు రోజులకొకసారి స్నానాలు చేస్తున్నారు.  బయట ఉన్న చేతిపంపుల వద్ద పలువురు విద్యార్థులు స్నానాలు చేస్తున్నారు. విద్యార్థులు ఎక్కువగా ఉండటంతో చేతిపంపుల వద్ద ఆలస్యమవుతుండటంతో పక్కనే ఉన్న పంట బోదెల్లో స్నానాలు చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరుగుదొడ్లలో నీరు లేకపోవడంతో బహిర్భూమికి పొలంగట్లకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  విద్యార్థులు ఇన్ని సమస్యలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నా, సంబంధిత ఉన్నతాధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు గానీ పట్టించుకోకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలలో  సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement