రైతుకోరిన అడంగల్‌కాపీ ఇవ్వడానికి లంచం తీసుకుంటుండగా ఓ వీఆర్‌ఓ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
ముప్పాళ్ళ : రైతుకోరిన అడంగల్‌కాపీ ఇవ్వడానికి లంచం తీసుకుంటుండగా ఓ వీఆర్‌ఓ ఏసీబీ అధికారులకు చిక్కాడు. దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పలుదేవర్లపాడు గ్రామానికి చెందిన వీఆర్వో తోట శ్రీనివాసరావు ఇరుకుపాలెం గ్రామానికి ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇరుకుపాలెం శివారు రామకృష్ణాపురానికి చెందిన చెరుకూరి నరసింహారావు విజయవాడలో నివసిస్తున్నాడు. రామకృష్ణాపురంలో తనకున్న 5.5 ఎకరాలకు సంబంధించి అడంగల్ కాపీ కోసం ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకోగా వీఆర్వో కాలయాపన చేసి చివరకు రూ. 10 వేలు అందిస్తే అడంగల్ ఇస్తానని తెలిపారు. మొత్తమ్మీద మధ్యవర్తుల ద్వారా రూ. తొమ్మిదివేలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. వెంటనే నరసింహారావు ఏసీబీ అధికారులను ఆశ్రయించి విషయాన్ని వివరించారు.
ఏసీబీ అధికారుల సూచన మేరకు పథకం ప్రకారం తొమ్మిది రూ. 1000 ల నోట్లు గురువారం తహశీల్దార్ కార్యాలయంలో ఉన్న వీఆర్వోకు అందించగా, మాటువేసిన ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీఆర్వోను అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం విజయవాడ తరలించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ రాజారావువు మాట్లాడుతూ లంచం డిమాండ్ చేసే అధికారుల సమాచారం తమకు అందిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. తన ఫోన్ నంబర్(9491305638)కు డయల్ చేయాలని కోరారు.
విసిగెత్తిపోయా: నరసింహారావు
తన సొంత పొలానికి సంబంధించి అడంగల్ కాపీ కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేశానని రైతు నరసింహారావు తెలిపారు. విజయవాడ నుంచి 20 సార్లు ముప్పాళ్ళ వచ్చాననీ, వీఆర్వో తిప్పుకుంటున్నారే తప్ప పనిచేయలేదని తెలిపారు. చివరకు రూ. 10 వేలు డిమాండ్ చేస్తే రూ. 9 వేలు చెల్లిస్తానని ఒప్పంద ం చేసుకొని ఏసీబీని ఆశ్రయించినట్టు ఆయన పేర్కొన్నారు.