తొలిరోజు  పింఛన్లు 96.5% మందికి

Above 96 percent pensions distribution in first-day  - Sakshi

55,86,571 మంది లబ్ధిదారుల చేతికి రూ.1,337 కోట్లు 

అనివార్య కారణాలతో తీసుకోలేకపోయిన వారికి వచ్చే నెలలో బకాయితో కలిపి పెన్షన్‌ డబ్బులు 

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ కారణంగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయి గత రెండు నెలలుగా పింఛను తీసుకోలేకపోయినవారికి ఊరట కల్పిస్తూ బకాయిలతో కలిపి మూడు నెలల డబ్బులను సోమవారం ఒకేసారి లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందచేసింది. వలంటీర్లు ఉదయమే లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి 8 గంటల కల్లా 70 శాతం మందికి పింఛన్‌ డబ్బులు పంపిణీ చేశారు. ఉదయం పది గంటల కల్లా 83 శాతం పంపిణీ పూర్తయింది. రాత్రి 8 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 55,86,571 మందికి పింఛన్‌ డబ్బులు రూ.1,337.85 కోట్లు అందజేశారు. తొలిరోజు మొత్తంగా 96.5 శాతం మంది పింఛను డబ్బులు అందుకున్నారు. 
నెల్లూరులో లివర్‌ వ్యాధిగ్రస్తుడు హరికి పెన్షన్‌ ఇస్తున్న వలంటీర్లు 

జియో ట్యాగింగ్‌తో పారదర్శకంగా...
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా బయోమెట్రిక్‌ విధానంలో కాకుండా మొబైల్‌ యాప్‌ ద్వారా జియో ట్యాగింగ్‌తో లబ్ధిదారుల ఫోటో తీసుకుని వలంటీర్లు పారదర్శకంగా పెన్షన్‌ డబ్బులు అందజేశారు. 
–రాష్ట్రవ్యాప్తంగా 2,37,615 మంది గ్రామ, వార్డు వలంటీర్లు తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ చేపట్టారు. 
– లాక్‌డౌన్‌ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన దాదాపు 30 వేల మంది పింఛనుదారులు పెన్షన్‌ తీసుకోలేకపోతున్నట్లు వలంటీర్ల ద్వారా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతో వారికి బకాయిలతో కలిపి వచ్చే నెలలో చెల్లించేలా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు ఏర్పాట్లు చేశారు. అనివార్య కారణాలతో జూన్‌ నెల పెన్షన్‌ డబ్బులు తీసుకోలేకపోయిన వారికి జూలైలో బకాయితో కలిపి ఇస్తామని సెర్ఫ్‌ సీఈవో పి.రాజాబాబు తెలిపారు.

వలంటీర్లకు మంత్రి పెద్దిరెడ్డి అభినందనలు
రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు 55 లక్షల మందికిపైగా పింఛన్‌ లబ్ధిదారులకు గంటల వ్యవధిలో నేరుగా డబ్బులు అందచేసిన వలంటీర్లను గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందించారు. కరోనా జాగ్రత్తలను పాటిస్తూ పెన్షన్లు పంపిణీ చేశారని చెప్పారు. పాలనను గ్రామస్థాయిలో ప్రజలకు చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూపకల్పన చేసిన సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ సాధిస్తున్న ఫలితాలకు పెన్షన్ల పంపిణీ నిదర్శనమన్నారు.

వలంటీర్ల విశేష కృషి
– పిడుగులు పడ్డా పింఛన్ల పంపిణీ ఆగలేదు..
– పోర్టబులిటీ ద్వారా ఉన్నచోటే నిశ్చింతంగా పెన్షన్‌ 
– ఐసీయూల్లో ఉన్నా అందుకున్నా లబ్ధిదారులు

విశాఖ ఏజెన్సీలో సకాలంలో పింఛన్లు పంపిణీ చేసేందుకు వలంటీర్లు అడవిలో సాహస యాత్ర చేశారు. పాడేరు మండలం వనుగుపల్లి పంచాయతీలోని మారుమూల ప్రాంతమైన చింతగున్నలు, మాతికబంద గ్రామాలకు చెందిన వలంటీర్లు పాంగి రాంబాబు, లోంబేరి వెంకటరమణ ఈదురు గాలులు, భారీ వర్షంతో ఆదివారం సాయంత్రం అడవిలో పెన్షన్‌ డబ్బులతో చిక్కుపోయారు. చీకటి పడే సమయానికి వర్షం తగ్గడంతో గ్రామానికి సురక్షితంగా చేరుకుని ఉదయాన్నే యధావిధిగా పింఛన్ల సొమ్ము పంపిణీ చేశారు.

కర్నూలు జిల్లా చాబోలు గ్రామానికి చెందిన వితంతు మహిళ ఎస్తేరు అనారోగ్యంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతోంది. గ్రామ వలంటీర్‌  ముస్తాక్‌ (దివ్యాంగుడు) సోమవారం ఐసీయూ వద్దే ఆమెకు పింఛన్‌ అందజేశాడు.

అనంతపురం జిల్లా తనకల్లు మండలం డి.చెక్కవారిపల్లి గ్రామ వలంటీర్‌ కోమలకు కాలు ఫ్రాక్చర్‌ అయ్యింది. ఆమె పరిధిలో 38 పింఛన్లు ఉండగా నడవలేని స్థితిలోనూ ఆటో అద్దెకు తీసుకొని మొదటి రోజు 35 మందికి పంపిణీ చేయడం విశేషం

జగ్గయ్యపేటకు చెందిన 85 ఏళ్ల వృద్ధుడు ఉప్పుటూరి నాగేశ్వరరావు లాక్‌డౌన్‌తో తెలంగాణాలోని భద్రాచలంలో తన కుమార్తె ఇంట్లో చిక్కుకుపోయాడు. 10వ సచివాలయం వెల్ఫేర్‌ సెక్రటరీ కొండా దుర్గారావు ఆధ్వర్యంలో వలంటీర్లు ఎం.ముత్యంబాబు, ఆర్‌.వరప్రసాద్‌ సోమవారం భద్రాచలం వెళ్లి నాగేశ్వరరావుకు నాలుగు నెలల పింఛన్‌ రూ.9 వేలు అందించారు. 

ఒకటో తేదీ వచ్చిందంటే వలంటీర్లు కచ్చితంగా తమ ఇంటి తలుపు తట్టి పెన్షన్‌ అందచేస్తారని లబ్ధిదారులు భరోసాగా ఉంటారు. వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు 10వ వార్డు శ్రీనివాసనగర్‌లో దివ్యాంగుడైన వలంటీర్‌ అఫ్జల్‌ వృద్ధురాలు ఖాసిం బీకి వితంతు పించను అందచేశాడు.

చిత్తూరులోని కట్టమంచికి చెందిన పుష్పవాణి మూత్రపిండాల వ్యాధితో తిరుపతిలోని స్విమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వార్డు వలంటీర్లు దినేష్‌బాబు, జగదీష్‌ సోమవారం ద్విచక్రవాహనంలో 140 కి.మీ ప్రయాణించి స్విమ్స్‌ ఆస్పత్రిలో పుష్పవాణికి రూ.10 వేల పెన్షన్‌ అందించారు.

వాకాడుకు చెందిన ముగూరు పోలమ్మ రెండు నెలల నుంచి సూళ్లూరుపేట మండలం కడపట్రలో బంధువుల ఇంట్లో ఉండిపోయింది. సూళ్లూరుపేట నుంచి వాకాడు 53 కిలో మీటర్ల దూరం ఉంది. పోర్టబిలిటీ ద్వారా ఆమెకు సూళ్లూరుపేట మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం రెండు నెలల పింఛన్‌ అందజేశారు. పట్టణంలో ఉంటున్న మరో 10 మందికి కూడా ఇలాగే అందించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top