ఉపాధ్యాయుడి వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థిని చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది.
బనగానపల్లి (కర్నూలు) : ఉపాధ్యాయుడి వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థిని చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం పాతపాడు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉషారాణి(13) స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. కాగా గతేడాది నుంచి పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న అబ్దుల్(25) తనను ప్రేమించమని వేధింపులకు దిగడంతో విద్యార్థిని విషయాన్ని పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది.
స్పందించిన యాజమాన్యం అబ్దుల్‌ను విధుల నుంచి తొలగించింది. అప్పటి నుంచి సదరు ఉపాధ్యాయుడు విద్యార్థిని పాఠశాలకు వెళ్తున్న సమయంలో రోడ్డు మీద కాపు కాసి వేధింపులకు గురి చేస్తుండటంతో.. మనస్తాపానికి గురైన బాలిక ఈ నెల 11న ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి కర్నూలు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమించి గురువారం మధ్యాహ్నం మృతిచెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.