సమైక్యాంధ్ర పరిరక్షణకోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 26న హైదరాబాద్‌లో నిర్వహించే సమైక్య శంఖారావం సభకు 800 బస్సులు, వందలాది కార్లలో భారీగా తరలివెళుతున్నట్టు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు.
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణకోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 26న హైదరాబాద్‌లో నిర్వహించే సమైక్య శంఖారావం సభకు 800 బస్సులు, వందలాది కార్లలో భారీగా తరలివెళుతున్నట్టు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ పత్రికాప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 16 నియోజకవర్గాల నుంచి 50 వేల మంది ఈ సభకు హాజరవుతారని అంచనావేసినట్టు తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలో 50 బస్సులు ఏర్పాటుచేశామని, కార్లు, ఇతర వాహనాల్లో వెళ్లేవారి సంఖ్య 15 వేల పైచిలుకు ఉంటుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.
వీరందరికీ అవసరమైన ఏర్పాట్లను ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలే చూసుకుంటారని, వీటికి అనుబంధంగా రాష్ట్ర పార్టీ కూడా సహకరిస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లో ఇందిరా పార్క్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, పబ్లిక్ గార్డెన్స్‌లో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.
రాజధానిలో వసతి ఏర్పాట్లు..
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి హైదరాబాద్ వచ్చే కార్యకర్తలకు హయత్‌నగర్‌లోని ధనుంజయ గార్డెన్స్‌లోను, పెడన, నందిగామ నియోజకవర్గాల నుంచి వచ్చేవారికి నాచారం పోలీస్‌స్టేషన్ పక్కన ఉన్న సి.కె. గార్డెన్స్‌లోను, మచిలీపట్నం నుంచి వచ్చే కార్యకర్తలకు ఉప్పల్ బస్టాండ్ (బోడుప్పల్) దగ్గర్లోని శబరి గార్డెన్స్‌లో వసతి ఏర్పాట్లు చేస్తున్నామని భాను తెలిపారు. జగ్గయ్యపేటతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి రామోజీ ఫిలింసిటీ వద్ద గల అన్నమాచార్య కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా నుంచి వచ్చే ప్రతి కార్యకర్త 25వ రాత్రికే హైదరాబాద్ వచ్చే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. రాష్ర్టం నలుమూలల నుంచి సుమారు ఆరు లక్షల మంది ఈ సభకు హాజరయ్యే అవకాశముందని రాష్ట్ర పార్టీ
అంచనావేస్తున్నట్టు తెలిపారు.
పాస్‌ల వివరాలు..
సీఈసీ, సీజీసీ సభ్యులు, తాజా, మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధులు, పార్టీ జిల్లా కన్వీనర్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, పార్లమెంట్ పరిశీలకులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర అనుబంధ కమిటీల కన్వీనర్లకు వీవీఐపీ పాసులు ఇస్తారని తెలిపారు. మండల కన్వీనర్లు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, జిల్లా పార్టీ అధికార ప్రతినిదులు, అనుబంధ విభాగాల కన్వీనర్లు, రాష్ర్ట పార్టీ సభ్యులకు వీఐపీ పాసులు ఇస్తారని పేర్కొన్నారు. వీరంతా తమ గుర్తింపుకార్డులు విధిగా తీసుకునిరావాలని ఉదయభాను సూచించారు.