వర్దా తుపాను ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో మంగళవారం కూడా వర్షాలు కురిశాయి. చలిగాలులకు నెల్లూరు జిల్లాలో నలుగురు మృతిచెందారు.
చలిగాలులకు నలుగురి మృత్యువాత
సాక్షి నెట్‌వర్క్: వర్దా తుపాను ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో మంగళవారం కూడా వర్షాలు కురిశాయి. చలిగాలులకు నెల్లూరు జిల్లాలో నలుగురు మృతిచెందారు. కృష్ణా జిల్లాలో వరి, ప్రకాశంలో మిర్చి, వైఎస్సార్ జిల్లాలో ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి. పలుచోట్ల చెట్లు పడిపోవడం, విద్యుత్ సబ్ స్టేషన్లు, స్తంభాలు దెబ్బతినటం, తీగలు తెగడంతో 900 గ్రామాలు సోమవారం రాత్రంతా చీకట్లోనే ఉండిపోయాయి. ముందుజాగ్రత్త చర్యగా పలు గ్రామాలకు అధికారులు విద్యుత్ సరఫరా నిలిపేశారు.
దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం కూడా కొన్ని రైళ్లను రద్దుచేశారు. మరికొన్నింటిని రేణిగుంట మీదగా మళ్లించారు. ఆదివారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సగటున 93.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా, తుపాను పరిస్థితిపై సీఎం చంద్రబాబు మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.