ఎన్నికల్లో 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలను బీజేపీ మహిళామోర్చా డిమాండ్ చేసింది.
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలను బీజేపీ మహిళామోర్చా డిమాండ్ చేసింది. రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోర్చా జాతీయ అధ్యక్షురాలు, పార్లమెంటు సభ్యులు సరోజా పాండే ఆదివారమిక్కడ ప్రధాన కార్యదర్శి విజయ రత్నాకర్, నేతలు మాలతీరాణి, పద్మజారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.
చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే ప్రజాస్వామ్యానికి అర్థముంటుందన్నారు. మహిళా సమస్యల పరిష్కారానికి త్వరలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ సరిగా వ్యవహరించకపోవడం వల్లే ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యమాలు తలెత్తాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహిళామోర్చాను పటిష్టం చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. నిర్భయ కేసులో దోషులకు త్వరగా శిక్షలు అమలయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు.