అరకోటి దోచింది ఖాకీలే.. | 3 cops Inspector held in Train Robbery Case | Sakshi
Sakshi News home page

అరకోటి దోచింది ఖాకీలే..

Apr 30 2019 5:24 AM | Updated on Apr 30 2019 5:24 AM

3 cops  Inspector held in Train Robbery Case - Sakshi

నెల్లూరు(క్రైమ్‌): ఖాకీలే దోపిడీ దొంగలుగా మారారు. రైల్వే పోలీసులమని నమ్మించి రైల్లో అక్షరాల అరకోటిని దోచుకున్నారు. పోలీసుల విచారణలో ఈ విషయం తేటతెల్లమైంది. ఈ నెల 15న నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన దోపిడీ కేసులో సూత్రధారులైన టీడీపీ నేత, అతని స్నేహితురాలితో పాటు ఆర్‌ఐ, ముగ్గురు ఏపీఎస్పీ కానిస్టేబుళ్లను శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రైల్వే పోలీసులు అరెస్ట్‌ చేశారు. నెల్లూరు రైల్వే డీఎస్పీ జి.వసంతకుమార్‌ సోమవారం వెల్లడించారు. ఆయన మాటల్లోనే.. కావలి పట్టణానికి చెందిన అనిత అక్కడే బంగారు వ్యాపారి మల్లికార్జున వద్ద పనిచేస్తోంది.

చెన్నాయపాళేనికి చెందిన టీడీపీ నాయకుడు రవితో ఆమె  సన్నిహితంగా ఉంటోంది. రవి అప్పులపాలై ఉండటం, అనితకు సైతం నగదు అవసరం కావడంతో బంగారు వ్యాపారిని బురిడీ కొట్టించి నగదు దోచుకోవాలనుకున్నారు. ఇదే విషయాన్ని రవి తన బంధువైన ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ (ప్రస్తుతం విజయవాడ ఎస్‌డీఆర్‌ఎఫ్‌)లో విధులు నిర్వహిస్తున్న మహేష్‌తో చర్చించాడు. మహేష్‌ తనతో పాటు పనిచేస్తున్న సహచర కానిస్టేబుల్స్‌ షేక్‌ సుల్తాన్‌బాషా, సుమన్‌కుమార్, ఆర్‌ఐ పి.మల్లికార్జున దృష్టికి తీసుకెళ్లి సహకరించాలని కోరారు. దోచుకున్న సొమ్మును పంచుకోవాలని నిర్ణయించుకున్నారు.

15న మల్లికార్జున రూ.50 లక్షలు అనితకు ఇచ్చి చెన్నై వెళ్లి బంగారు బిస్కెట్‌లు తేవాలన్నాడు. అనిత ఈ విషయాన్ని రవికి చెప్పింది. తన స్నేహితురాలు, సీజన్‌బాయిలతో కలసి నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌లో చెన్నై వెళుతున్నామని చెప్పింది. మహేష్‌కు విషయాన్ని చేరవేసిన రవి.. అతని సూచనల మేరకు అదే రైలెక్కాడు. పథకం ప్రకారం నెల్లూరు రైల్వేస్టేషన్‌లో సుల్తాన్‌బాషా, సుమన్‌కుమార్‌లు రైలెక్కారు. అనిత ఉన్న కోచ్‌లోకి వెళ్లి తాము రైల్వే పోలీసులమని బెదిరించి నగదు ఉన్న బ్యాగులతో గూడూరు రైల్వేస్టేషన్‌లో దిగేశారు. అదే రోజు రాత్రి బిట్రగుంట వద్ద నగదును పంచుకున్నారు.

తీగ లాగితే డొంకంతా కదిలింది..
తనపై అనుమానం రాకుండా ఉండేందుకు అనిత ఈ వ్యవహారాన్ని తన యజమానికి తెలియజేసింది. ఆయన సూచనల మేరకు గూడూరు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు.  అనిత ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో రైల్వే పోలీసులు  25వ తేదీన ఆమెను అదుపులోకి తీసుకుని విచారించడంతో  విషయం బయటపడింది. ఆ తర్వాత రవిని అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి రూ. 20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.  ముగ్గురు కానిస్టేబుళ్లు, ఆర్‌ఐ వద్ద నుంచి రూ. 30 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement