అప్పటివరకు చలాకీగా ఇంటి ఆవరణలో ఆడుకున్న చిన్నారి కాసేపటికే విగత జీవిగా మారింది. నీళ్లు నిల్వచేసుకునే తొట్టే ఆ పసిపాప ప్రాణం తీసింది.
మదన్‌పల్లి (శంషాబాద్ రూరల్), న్యూస్‌లైన్: అప్పటివరకు చలాకీగా ఇంటి ఆవరణలో ఆడుకున్న చిన్నారి కాసేపటికే విగత జీవిగా మారింది. నీళ్లు నిల్వచేసుకునే తొట్టే ఆ పసిపాప ప్రాణం తీసింది. ఈ విషాద ఘటన శుక్రవారం శంషాబాద్ మండలం మదన్‌పల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వానరాసి గోపి, మనీల దంపతులు. వీరికి రెండేళ్ల కూతురు అరుణ ఉంది. కుటుంబసభ్యులంతా భిక్షాటన చేస్తుంటారు.
శుక్రవారం ఉదయమే మనీల భిక్షాటనకు వెళ్లింది. ఇంటి వద్ద గోపితోపాటు మనీల చెల్లెలు రామలక్ష్మి ఉన్నారు. మధ్యాహ్నం గోపి పనినిమిత్తం సమీపంలోని హోటల్ వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆడుకుంటూ అరుణ ఇంటి ఆవరణలో ఉన్న నీటితొట్టిలో పడిపోయింది. కొద్దిసేపటి తర్వాత అరుణ కోసం రామలక్ష్మి చుట్టుపక్కల ఇళ్లలో వెతికినా కన్పించలేదు. ఇంటికి వచ్చి నీటితొట్టిలో చూడగా నీళ్లలో అరుణ పడి ఉంది. వెంటనే చిన్నారిని బయటకు తీయగా అప్పటికే మృతి చెందింది. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు ఇంటి కి చేరుకుని బోరున విలపించారు. మనీల ప్రస్తుతం గర్భిణి కాగా చిన్నారి అరుణ ఈ దంపతుల ఏకైక సంతానం.