280వ రోజు పాదయాత్ర డైరీ

280th day padayatra diary - Sakshi

07–10–2018, ఆదివారం
కలవచర్ల, విజయనగరం జిల్లా

ఏ ఆశయంతో 108, ఆరోగ్యశ్రీ అవతరించాయో.. అదికాస్తా అంతరించిపోతుండటం విచారకరం
ఈ రోజు చీపురుపల్లి నియోజకవర్గంలోని కెల్ల, రెల్లిపేట, గుర్ల గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. కెల్ల గ్రామంలో అంబళ్ల సీతమ్మ దయనీయగాథ మనసును కలచివేసింది. ఆమెకు ఒక్కగానొక్క కొడుకు. ఏడేళ్ల కిందట మేడ మీద నుంచి పడటంతో వెన్నెముక దెబ్బతింది. మంచానికే పరిమితమయ్యాడు. భర్త తెచ్చే కూలి డబ్బులతోనే ఇంటిని నడుపుతూ.. కొడుకుకు సపర్యలు చేసుకుంటూ గడుపుతోందా తల్లి. ఏడు నెలల కిందట ఆమె భర్తకూ యాక్సిడెంట్‌ అయింది. మూత్రాశయం దెబ్బతింది. ఆరోగ్యశ్రీ వర్తించదన్నారు. వైద్యానికి వేలకు వేలు ఖర్చుపెట్టలేని దుస్థితి. ఓ వైపు.. భర్తకు, బిడ్డకు పసిబిడ్డలకు వలే సపర్యలు చేసుకోవాలి. మరోవైపు.. కూలి పనులకెళ్లి కుటుంబాన్ని పోషించాలి. ఆ సీతమ్మ కష్టాలు గుండెను బరువెక్కించాయి.  

కోడూరుకు చెందిన భవానీ అనే చెల్లెమ్మ.. 108కి పట్టిన దుర్గతిని వివరించింది. పక్కింట్లో ఉండే గౌరికి పురిటి నొప్పులొస్తే 108కి ఫోన్‌ చేసిందట. టైర్‌ పంక్చరైందని, స్టాఫ్‌ కూడా లేరని సమాధానం వచ్చింది. చేసేదిలేక స్కూల్‌ పిల్లల్ని తీసుకెళ్లే ఆటోలో ఆస్పత్రికి తరలించారట. ఆ సమయంలోఆ తల్లిపడ్డ నరకయాతన అంతా ఇంతా కాదు. నాన్నగారు ప్రారంభించిన 108 వ్యవస్థ దేశంలోని 16 రాష్ట్రాల్లో, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో, బంగ్లాదేశ్, శ్రీలంకల్లో సైతం అమలవుతుండటం గర్వకారణం. ఆ పథకం ప్రారంభమైన మన రాష్ట్రంలో మాత్రం నిర్వీర్యమవుతుండటం బాధాకరం. ఏ మహదాశయంతో 108, ఆరోగ్యశ్రీ అవతరించాయో.. అదికాస్తా అంతరించిపోతుండటం అత్యంత విచారకరం.  

బుదరాయవలసకు చెందిన విశ్వబ్రాహ్మణులు కలిశారు. ఆ గ్రామం ఇత్తడి వస్తువుల తయారీకి చాలా ప్రసిద్ధి. ఒకప్పుడు వందలాది కుటుం బాలవారు ఇత్తడి సామగ్రిని తయారుచేసి.. ఇతర రాష్ట్రాలకు సైతం ఎగుమతి చేసేవారు. అలాంటి వృత్తి నైపుణ్యానికి ప్రోత్సాహం కరువై.. ఆదరణ తరిగిపోయి.. కుటుంబాలకు కుటుంబాలు వలస వెళ్లిపోయే దుస్థితి దాపురించింది. ఒకప్పుడు ఆ సంప్రదాయ కళను నమ్ముకుని గౌరవంగా బతికిన తాము.. నేడు కూలీలుగా మారాల్సి వచ్చిందని ఆ సోదరులు ఆవేదన వ్యక్తం చేశారు.

పెనుబర్తి, గోషాడ గ్రామ రైతన్నలు కలిశారు. సమీపంలోనే తోటపల్లి కుడి ప్రధాన కాలువ కనిపిస్తున్నా.. వారి పొలాలకు నీరందని దౌర్భాగ్యాన్ని వివరించారు. మిగిలిపోయిన పిల్ల కాలువ పనుల విషయంలో ఈ ప్రభుత్వ నిర్లక్ష్యమే దానికి మూలకారణమన్నారు. నాన్నగారు తన పాదయాత్రలో ఈ జిల్లా రైతన్నల హృదయ ఘోష విన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఇచ్చిన మాట ప్రకారం తోటపల్లి ప్రాజెక్టును ప్రారంభించారు. శరవేగంతో పనులు జరిగాయి. బాబుగారు అధికారంలోకి వచ్చేప్పటికి 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత అయిదు శాతం పనులు కూడా చేయకపోవడం.. నేటి పాలకుల సంకుచితత్వానికి నిదర్శనం. రైతాంగం పట్ల బాబుగారికి ఉన్న కపట ప్రేమకు తార్కాణం.
 
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. రాష్ట్రంలో వందకు పైగా 108 వాహనాలు మూలన పడి ఉండగా.. మీ డ్యాష్‌ బోర్డులో మాత్రం 95 శాతం వాహనాలు సక్రమంగా సేవలందిస్తున్నట్లు చూపించడం ఎవర్ని మోసం చేయడానికి? వాటికి చెల్లిస్తున్న బిల్లులు ఎవరి జేబుల్లోకి వెళుతున్నట్టు? 108 వాహనాల కొనుగోళ్లు, నిర్వహణలో సైతం భారీ అవినీతి జరిగిందనేది వాస్తవం కాదా? దీనిపై హైకోర్టు నోటీసులివ్వడం నిజం కాదా?

 -వైఎస్‌ జగన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top