278వ రోజు పాదయాత్ర డైరీ | 278th day padayatra diary | Sakshi
Sakshi News home page

278వ రోజు పాదయాత్ర డైరీ

Oct 5 2018 3:35 AM | Updated on Oct 7 2018 3:02 AM

278th day padayatra diary - Sakshi

04–10–2018, గురువారం
మూల స్టేషన్, విజయనగరం జిల్లా

సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసినవారు చరిత్రహీనులుగా మిగిలిపోతారు

రామతీర్థ సాగర్‌ ప్రాజెక్టు ఈ ప్రాంతవాసుల దశాబ్దాల కల. ఏ నాయకుడూ చేపట్టని ఆ బృహత్కార్యాన్ని నాన్నగారు తలపెట్టారు. ఆయన హయాంలో పనులు శరవేగంగా దూసుకుపోయాయి. ఆయన లేకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.. అన్న చందంగా తయారైంది. నేటి ప్రభుత్వమే ఆ ప్రాజెక్టు పాలిట శాపమైంది. ఈ రోజు పూసపాటిరేగ మండల రైతన్నలు కలిశారు. గతంలో వారి గ్రామాలకు కుమిలి పెద్దచెరువు నుంచి సాగునీరు అందేది.

ఆ చెరువు రామతీర్థ సాగర్‌ ప్రాజెక్టులో అంతర్భాగమైంది. ఈ ప్రభుత్వం వచ్చాక రైతన్నల ఆశలు ఆవిరయ్యాయి. ఓ వైపు.. ప్రాజెక్టు పూర్తికాక సాగునీరు అందడం లేదు. మరోవైపు.. అంతకు మునుపులా చెరువు నీరూ లేదు. ప్రాజెక్టు పూర్తయ్యే వరకు సాగునీరు అందించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్న పాలకులు.. ఆ మాటే మర్చిపోయారు. ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందని ఆ రైతన్నలు వాపోయారు. సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసినవారు.. చరిత్రహీనులుగా మిగిలిపోతారు.. అంటూ నాన్నగారు తరచూ చెప్పే మాటలు గుర్తొచ్చాయి.  
 
దారిలో చంపావతి నదిని చూసి చాలా బాధేసింది. వర్షాకాలంలో నిండు ప్రవాహంతోకళకళలాడాల్సిన ఆ నది ఏ ప్రవాహమూ లేక వెలవెలబోతోంది. వర్షాభావం ఓ కారణమైతే.. అడ్డదిడ్డంగా జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలు మరో కారణం. ఇసుకాసురులు ఆ నది మొత్తాన్ని చెరబట్టేశారు. డెంకాడ వద్ద ఇసుక తవ్వకాల కోసం నది మధ్యలో రోడ్డు వేశారంటే.. దోపిడీ ఎంతలా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రమంతటా ఇదే దుస్థితి. ఇష్టారాజ్యంగా, అడ్డదిడ్డంగా ఇసుకను తవ్వేయడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఎక్కడికక్కడ ఏరులు ఎడారులను తలపిస్తున్నాయి.

వందేళ్ల చరిత్ర కలిగిన నెల్లిమర్ల జూట్‌ మిల్లు పక్క నుంచి పాదయాత్ర సాగింది. ఉత్తరాంధ్ర మొత్తం జూట్‌ మిల్లులకు ప్రసిద్ధి. వేలాది మందికి ఉపాధినిచ్చే ఈ మిల్లులు.. ప్రభుత్వ ప్రోత్సాహంలేక.. కరెంటు చార్జీల భారం ఎక్కువై ఒక్కొక్కటిగా మూతబడుతున్నాయి. మిల్లులు మూతబడుతుంటే.. దానిమీద ఆధారపడి బతుకుతున్న కార్మికుల జీవితాలు తలకిందులవుతున్నాయి. కుటుంబాల్ని పోషించుకోలేక, పిల్లల్ని చదివించుకోలేక వలసెల్లి పోవాల్సిన అధ్వాన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇక్కడ ఉన్న పరిశ్రమలే మూతపడుతుంటే.. కొత్తవాటికోసమంటూ ప్రజాధనంతో ప్రత్యేక విమానాల్లో విదేశాలకు ఊరేగుతున్నారు మన పాలకులు.  
 
ఆ మిల్లు సమీపంలోనే మిరియాల లక్ష్మి అనే సోదరి కలిసింది. భర్త ఐస్‌క్రీంలు అమ్ముకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈమేమో ల్యాబ్‌ టెక్నీషియన్‌ కోర్సు పూర్తి చేసి కూడా ఉద్యోగం లేక ఖాళీగా ఉంది. వారికి ఇద్దరు అమ్మాయిలు. ‘ముఖ్యమంత్రి చెప్పిన మా ఇంటి మహాలక్ష్మి పథకం నా పిల్లలకు రాదా అన్నా..’ అంటూ అమాయకంగా అడిగింది. బహుశా ఆ చెల్లెమ్మకు తెలియదేమో.. బాబుగారు అలాంటి పథకాలన్నింటినీ ఎప్పుడో అటకెక్కించేశాడని.  
 
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఆడపిల్లల కోసం గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బంగారుతల్లి లాంటి పథకాలను ఆపి వేయడం వాస్తవం కాదా? ఆ పథకాలలో గతంలోనే నమోదైన పిల్లల తల్లిదండ్రులకు ఏం సమాధానం చెబుతారు? పోనీ.. మీరు పెడతానన్న మా ఇంటి మహాలక్ష్మి పథకంలో కనీసం ఒక్కరంటే ఒక్క ఆడబిడ్డ పేరైనా నమోదుచేశారా? ఇది ఆడపిల్లలను దారుణంగా వంచించడం కాదా?   

-వైఎస్‌ జగన్‌ 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement