వంటకం..వాంతులతో కలకలం

20 Members Illness With Chicken Rice in Chittoor - Sakshi

చిత్తూరు, గుడిపాల: బోరాన్‌తో వంటకాలు వండి తమను ఆస్పత్రి పాల్జేశాడా వంటమాస్టర్‌ అంటూ బాధితులు గగ్గోలు పెట్టారు. ఇది గమనించిన మరికొందరు భోజనం చేస్తే తమకీ ఇదే పరిస్థితి ఎదురవుతుందని అప్రమత్తమై ఆ భోజనానికో నమస్కారం పెట్టారు. ఆదివారం ఈ సంఘటన మండలంలోని చిత్తపారలో చోటుచేసుకుంది. హడలెత్తించిన ఆ స్పెషల్‌ వంటకం కథాకమామీషులోకి వెళితే..గ్రామంలో ఎర్రోడు అనే వ్యక్తి తన కుమారులకు ఆదివారం మధ్యాహ్నం మునీశ్వరుడు పొంగళ్లు పెట్టారు.  ఇందుకుగాను వారి బంధువులందరితో పాటు గ్రామస్తులను భోజనానికి ఆహ్వానించాడు. దాదాపు 200మంది వచ్చారు. పసందైన చికెన్‌ వంటకం సిద్ధం చేయడంతో తొలుత కొందరు భోజనానికి కూర్చుని తినసాగారు. భోజనం ఏదోలా ఉందని కొందరు.. ఉప్పులేదని మరికొందరు..ఏదో తేడాగా ఉందని ఇంకొందరు..చెప్పడం పూర్తయ్యిందో లేదో భోజనం చేసిన 20 మంది భళ్లున వాంతి చేసుకున్నారు. దీంతో తక్కిన వారు భోజనం చేయడానికి సాహసించలేదు.

వాంతులతో అస్వస్థతకు గురైన వారు గుడిపాల ప్రభుత్వాస్పత్రికి పరుగులు తీశారు. అక్కడ కూడా మరోసారి బాధితులకు వాంతులయ్యాయి. ఇక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సమీపంలోని తమిళనాడు ఆస్పత్రికి వెళ్లారు. ఇంతగడబిడకు కారణమేమిటంటే బోరాన్‌..!! పంటల సాగు సమయంలో సూక్ష్మపోషకాల లోపాల నివారణకు దీనిని వినియోగిస్తారు. ఇది ఉప్పును పోలి ఉంటుంది. వంట చేస్తున్న ప్రదేశంలో ఈ ప్యాకెట్లు ఉండడంతో వంటమాస్టర్‌ ఇది ఉప్పుగా భ్రమించి వంటకాల తయారీకి వినియోగించాడు. దీనివల్ల రుచిమారి, భోజనం చేసిన వారి కడుపులో గడబిడ సృష్టించింది. వాంతులకు కారణమైంది. ఎక్కువ మోతాదులో వంటకు వినియోగించే ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని, అస్వస్థతకు గురైన వారికి ప్రాణహాని ఏమీ లేదని గుడిపాల వైద్యులు చెప్పారు. మొత్తానికి మరో 180 మంది అదృష్టవంతులే! వినాయకా..పండగ పూట పెద్ద విఘ్నం తప్పించావయ్యా..స్వామీ అని దండం పెట్టి, ఇళ్లకు వెళ్లిపోయారా గ్రామస్తులు విందు ఆరగించకుండా!!
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top