
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తాజాగా మరో 51 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,756కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. దీంతో రికవరీ రేటు 65.84 శాతానికి చేరింది. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు 8,415 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 62 మందికి పాజిటివ్ లక్షణాలున్నట్లు నిర్ధారణైంది.
ఈ 62 కేసుల్లో 18 కేసులు తమిళనాడు కోయంబేడుకు సంబంధించినవే ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో 14, చిత్తూరు జిల్లాలో 4 కేసులు కోయంబేడు మార్కెట్‌కు వెళ్లి వచ్చినవారిగా నిర్ధారించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,667కు చేరుకుంది. ఇందులో 153 మంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఉన్నారు. ఇదిలా ఉండగా, కృష్ణా జిల్లాలో ఒక మరణం నమోదైంది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 55కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 856గా ఉంది.