కోర్, బఫర్‌జోన్‌ పరిధిలోకి కడప | 15 Corona Positive Cases in YSR Kadapa | Sakshi
Sakshi News home page

కరోనా అలజడి

Apr 2 2020 9:38 AM | Updated on Apr 2 2020 9:38 AM

15 Corona Positive Cases in YSR Kadapa - Sakshi

కోవిడ్‌ ఆస్పత్రిలో సూచనలు చేస్తున్న కలెక్టర్‌ హరికిరణ్‌

సాక్షిప్రతినిధి కడప : జిల్లా ప్రజలు ఒక్కసారిగా కలవరపడ్డారు. ఇప్పటివరకూ ఒక్కరికీ కరోనా సోకలేదనే సమాచారం మంగళవారం రాత్రి వరకూ ఊరట నిచ్చింది. బుధవారం ఒక్కరోజే 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయనే వైద్య శాఖ వెల్లడించడంతో ఆందోళన వ్యక్తమైంది. కడప నగరానికి చెందిన నలుగురు, ప్రొద్దుటూరు పట్టణంలో ఏడుగురు, వేంపల్లిలో ఇద్దరు, బద్వేలు, పులివెందుల ప్రాంతాలకు చెందిన ఒక్కొక్కరు చొప్పున వైరస్‌ బారిన పడ్డారు. ఢిల్లీలోని నిజాముద్ధీన్‌ ప్రార్థనలకు జిల్లా నుంచి 86 మంది వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో సోమవారం 46 మంది రక్తనమూనాలు తీసి ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపగా 15 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు అధికారులు ధ్రువీకరించారు. మంగళవారం మరో 30 మందికి సంబంధించిన రక్తనమూనాలను ల్యాబ్‌లకు పంపారు. వీటి రిపోర్టులు బుధవారం రాత్రి లేదా గురువారం ఉదయానికి వచ్చే అవకాశముంది. గత పది రోజుల్లో జిల్లాలో ఒకటి కూడా కరోనా పాజిటివ్‌ నమోదు కాకపోయినా బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో అన్ని జిల్లా కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. వ్యాధి సోకిన వారందరికి కడప శివారులోని ఫాతిమా మెడికల్‌ కళాశాలలో పూర్తిస్థాయి వైద్య సేవలందిస్తున్నారు. 

కరోనా వ్యక్తుల కాంట్రాక్టులపై ఆరా
ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన కొందరికి కరోనా పాజిటివ్‌ రావడంతో వారిని కలిసిన వ్యక్తులపై అధికారులు దృష్టి సారించారు. వీరికి సంబంధించిన వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ప్రాథమిక దశ కింద (కుటుంబ సభ్యులు, దగ్గరివారు) వివరాలు సేకరించడంతో పాటు రక్తనమూనాలు తీసుకున్నారు. తదుపరి సెంకడరీ కాంట్రాక్టు ( కుటుంబ సభ్యులతో కలిసినవారు)వివరాలను సేకరించి పరిశీలనలో పెట్టనున్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారితో ప్రైమరీ కంట్రాక్టు వ్యక్తులను కూడా ఫాతిమా మెడికల్‌ కళాశాలలో వైద్యసేవలందిస్తున్నారు. కరోనా బారిన వ్యక్తులున్న ప్రాంతాలను కంటోన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. పాజిటివ్‌ ఉన్న వ్యక్తి ప్రాంతం కేంద్రంగా మూడు నుంచి ఎనిమిది కిలోమీటర్ల రేడియేషన్‌లో రాకపోకలు నిషేధించారు. మూడుకిలోమీటర్ల పరిధిలో ఉన్నవారికి నిత్యావసరాలను డోర్‌డెలివరీ ద్వారా అందించేందుకు నిర్ణయించారు. బుధవారం నాటికి జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన క్వారంటైన్లలో 2016 పడకలు సిద్ధం చేసిన అధికారులు వీటికి అదనంగా మూడు వేల పడకలను పెంచి ఐదువేల పడకలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

కోవిడ్‌ ఆస్పత్రిని సందర్శించిన కలెక్టర్‌
కడప సిటీ : పులివెందుల రోడ్డులోని ఫాతిమా మెడికల్‌ కళాశాలలో కోవిడ్‌ ఆస్పత్రిని కలెక్టర్‌ సందర్శించి వసతులపై ఆరా తీశారు.

కోర్, బఫర్‌జోన్‌ పరిధిలోకి కడప
కడప అర్బన్‌ : కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు గుర్తించిన క్రమంలో కడప నగరమంతా బఫర్‌జోన్‌ పరిధిలోకి వస్తుందని డీఎస్పీ యు. సూర్యనారాయణ అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ నగరంలోని సాయిపేట, అబ్దుల్‌ నబీ స్ట్రీట్, అలంఖాన్‌ పల్లెలకు సంబంధించి నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో కోర్‌జోన్‌గానూ, కోర్‌జోన్‌ల నుంచి ఐదు కిలోమీటర్ల మేరకు బఫర్‌జోన్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వీధుల్లో తిరగరాదన్నారు. కూరగాయలు, నిత్యావపర సరుకులు, మందులు కావాలన్నా, మొబైల్‌ వాహనాల ద్వారానే అందిస్తామన్నారు. ఏడురోడ్ల కూడలి, కృష్ణాసర్కిల్, ఎన్టీఆర్‌ సర్కిల్‌లు కూడా కోర్‌జోన్‌ పరిధిలోకి వస్తాయన్నారు. మెడికల్‌ షాపులన్నీ అక్కడక్కడా పరిమిత సమయంలో ఏర్పాటు చేయాలని మాట్లాడామన్నారు. మొబైల్‌ వ్యాన్‌ల ద్వారా మందులను సరఫరా చేసేవిధంగా ప్రయత్నిస్తున్నామన్నారు.ఎవరూ బయటకు రావద్దుకరోనా పాజిటివ్‌ కేసులు జిల్లాలో నమోదైన నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా మెలగాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. అందరూ పోలీసులకు సహకరించాలి. ఇళ్లలోనే ఉండాలి. భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. అవగాహన పెంచుకుని జీవనశైలిలో మార్పు తెచ్చుకోవడం అందరికీ ఉపయుక్తం. ప్రభుత్వ పరంగా అన్ని చర్యలూ తీసుకుంటోంది. ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలి. స్వీయ నిర్బంధానికి మించిన మందు లేదు.    అన్బురాజన్, జిల్లా ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement