గంటా తనయుడు రవితేజకు 14 రోజుల రిమాండ్ | 14 days remand to Raviteja of Ganta srinivasa Rao son | Sakshi
Sakshi News home page

గంటా తనయుడు రవితేజకు 14 రోజుల రిమాండ్

Mar 17 2014 8:49 PM | Updated on Sep 2 2017 4:49 AM

గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజ

గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజ

తెలుగుదేశం పార్టీ నేత,మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజ, అతని స్నేహితుడు ఇంద్రజిత్‌లకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ సోమవారం రాత్రి మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.

 హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేత,మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజ, అతని స్నేహితుడు ఇంద్రజిత్‌లకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ సోమవారం రాత్రి మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. కాగా రాత్రి సమయం కావడంతో వారిని మేజిస్ట్రేట్ వద్ద నుంచి శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మంగళవారం ఉదయం వారిని జైలుకు తరలించే అవకాశం ఉంది.

 రవితేజ మద్యం సేవించి సోమవారం తెల్లవారుజామున శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో వీరంగం సష్టించాడు. తన స్నేహితుడైన ఇంద్రజిత్తో కలిసి అభ్యంతరకరంగా ప్రవర్తించడంతో పాటు పుష్ఫక్ బస్సు కండక్టర్‌పై దౌర్జన్యం చేయడంతో పోలీసులు ఇరువురినీ అరెస్టు చేశారు. ఆర్‌జీఐఏ పోలీసుస్టేషన్ ఇన్‌స్పెక్టర్ కష్ణయ్య కథనం ప్రకారం రవితేజ తన స్నేహితుడైన పంజగుట్టకు చెందిన వ్యాపారి శ్రీనివాసులు కుమారుడు ఇంద్రజిత్‌తో కలిసి ఆదివారం అర్ధరాత్రి వరకు నగరంలో మద్యం సేవించారు. సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో మరోసారి మద్యం తాగాలని భావించిన ఇద్దరూ దానికోసం ప్రయత్నించారు. హోలీ పండుగ నేపథ్యంలో నగరంలోని మద్యం దుకాణాలన్నీ మూసేయడంతో శంషాబాద్‌లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరారు. అక్కడి ట్రాన్సిట్ ప్రీమియం ప్లాజాకు వెళ్లి మద్యం కావాలని డిమాండ్ చేశారు. అప్పటికే ఇరువురూ మద్యం మత్తులో ఉన్న విషయం గుర్తించిన బార్ సిబ్బంది అందుకు నిరాకరించారు. దీంతో బార్ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన రవితేజ, ఇంద్రజిత్ పరుషపదజాలంతో దూషించారు.

తీవ్రస్థాయిలో గలాభా సష్టించిన తరవాత అక్కడ మద్యం తీసుకున్న ఇద్దరూ సమీపంలోని పుష్పక్ బస్స్టాప్ వద్దకు వెళ్లారు. దాని సమీపంలో బస్సు కోసం వేచి ఉన్న మహిళా ప్రయాణికులు ఉన్నారు. వారిని పట్టించుకోకుండా వారు ఇద్దరూ మద్యం తాగుతూ నానా హంగామా చేశారు. ఈ విషయం గమనించిన కౌంటర్‌లోని కండక్టర్ రమేష్‌గౌడ్‌తో పాటు సిబ్బంది వచ్చి వీరిద్దరినీ వారించారు. దీంతో మద్యం మత్తులో ఉన్న ఇద్దరూ కౌంటర్ వద్దకు చేరుకున్నారు. ఇంద్రజిత్ తన చేతికి ఉన్న కట్టును రమేష్‌గౌడ్‌కు చూపిస్తూ,  దానిపై ‘నీ పేరు రాయి’ అంటూ గద్దించాడు. పరిస్థితి చేయిదాటుతోందని ఊహించిన కండక్టర్ సమీపంలోని సెక్యూరిటీ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన ఇరువురూ కండక్టర్‌ను అభ్యంతరకర పదజాలంతో దూషించారు.  తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగి కాలర్ పట్టుకుని దాడికి యత్నించారు. రమేష్‌గౌడ్ వెంటనే అక్కడే ఉన్న పోలీసు సబ్-స్టేషన్ సిబ్బంది దష్టికి తీసుకెళ్లారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆర్‌జీఐఏ పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారు. రమేష్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవితేజ, ఇంద్రజిత్‌పై ఐపీసీ 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందితులు ఇద్దరినీ అత్తాపూర్‌లోని మెజిస్ట్రేట్ ఇంట్లో హాజరు పరిచారు.  మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు.

Advertisement
 
Advertisement
Advertisement