ఇంట్లోకి లాక్కెళ్లి దాడి చేశారు

11 people arrested In police attack case At Tadipatri - Sakshi

పోలీసులపై దాడి కేసులో 11 మంది అరెస్ట్‌  

తాడిపత్రి అర్బన్‌: కడప టూటౌన్‌ సీఐ హమీద్, పోలీసు సిబ్బందిని మట్కా మాఫియా సభ్యులు ఇంట్లోకి లాక్కెళ్లి నిర్బంధించి దాడి చేశారని అడిషనల్‌ ఎస్పీ చౌడేశ్వరి తెలిపారు. ఉన్నతాధికారుల అదేశాల మేరకు సీఐ సురేంద్రరెడ్డి, ఎస్‌ఐ శ్రీధర్, రాఘవరెడ్డిలు 11 మంది నిందితులను కొత్త మసీదు టీచర్స్‌ కాలనీలో సోమవారం అరెస్టు చేశారన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కడప టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన మట్కా కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం సీఐ హమీద్‌ సిబ్బందితో కలసి ఆదివారం తాడిపత్రికి వచ్చారన్నారు. ఇంటికి వెళ్లిన పోలీసులు మట్కా కేసుకు సంబంధించి రషీద్‌ తండ్రి ఉస్మాన్‌ను ఆరాతీస్తున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు తెలిపారు. 

పోలీసులపై దాడికి పాల్పడి వారి వాహనానికి నిప్పుపెట్టిన కేసులో ప్రధాన నిందితులైన రషీద్, ఇతని సోదరులు నౌషాద్, బషీర్, అనుచరులు రజాక్, షేక్షావలి అలియాస్‌ చోటు, జాన్సన్, ఇలియాజ్‌ బాషా, గజ్జల అర్జున్, వేటూరి శివకుమార్, షేక్‌ఖాజా, ఇండ్ల వంశీకృష్ణ, మసూద్‌లను అరెస్టు చేశామని పేర్కొన్నారు. అరెస్టు అయిన వారిలో రషీద్‌పై గతంలో రెండు బైండోవర్‌ కేసులు, రెండు మట్కా కేసులు మరో రెండు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు ఉన్నాయన్నారు. మిగిలిన వారిపైనా కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.

 తీవ్రంగా గాయపడిన సీఐ హమీద్‌ మాట్లాడలేని స్థితిలో ఉండటంతో గాయపడిన మరో కానిస్టేబుల్‌ నరేంద్రరెడ్డి ఫిర్యాదు మేరకు తాడిపత్రిలో కేసు నమోదు చేశామన్నారు. కేసుకు సంబంధించి ఇప్పటివరకు 11మందిని అరెస్టు చేశామన్నారు. ఈ దాడిలో దాదాపు 15 నుంచి 25మంది వరకు పాల్గొన్నట్లు తెలస్తోందన్నారు. మిగతా నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top