
చికెన్ దుకాణంలో ఉన్న మృతిచెందిన కోళ్లు
విజయనగరం, సాలూరు: కరోనాపై అవగాహన కల్పించేందుకు, సాధారణ తనిఖీల నిమిత్తం శుక్రవారం పెదబజారులో మున్సిపల్ కమిషనర్ నూకేశ్వరరావు సిబ్బందితో కలిసి పర్యటించారు. ఈ క్రమంలో ఓ చికెన్ దుకాణం సమీపంలో వేలాడదీసి ఉన్న మృతిచెందిన కోళ్లను గుర్తించారు. కమిషనర్‌ను చూసిన సదరు దుకాణదారుడు పారిపోయాడు. వెంటనే సిబ్బందితో కలిసి కమిషనర్ దుకాణంలోకి వెళ్లి పరిశీలించారు. మరణించిన కోళ్లను శుభ్రపరిచి ఐస్‌బాక్స్‌లో పెట్టి ఉండడాన్ని గమనించారు. ఆ కోళ్లను సిబ్బందితో ప్రత్యేక మున్సిపల్ వాహనంలో స్థానిక డంపింగ్ యార్డ్‌కు తరలించి, వాటిని పాతిపెట్టారు. సదరు చికెన్ వ్యాపారి కొలిసి అక్కయ్యకు రూ.10 వేల జరిమానా విధించినట్లు కమిషనర్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేయాలని పట్టణ ఎస్సై శ్రీనువాసరావును కోరారు.