అమరావతిలో తెలుగుకు ప్రాధాన్యమివ్వాలి

Amaravati should be preferred to telugu says venkaiah - Sakshi

     ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆకాంక్ష

     విజయవాడలో పుస్తకమహోత్సవం ప్రారంభం

సాక్షి, విజయవాడ: అమరావతిలో తెలుగు భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో 29వ పుస్తకమహోత్సవాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన సభలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. అమరావతి రహదార్లపై రాకపోకలు తెలియజేసే సూచికలు తెలుగులోనే ఉండాలని చెప్పారు. బతుకుదెరువుకు ముందు మాతృ భాషపై పట్టుసాధించి, తర్వాత హిందీ, ఇంగ్లీషు అదనంగా నేర్చుకోవాలన్నారు.

కార్పొరేట్‌ పాఠశాలల్లో చదువుకుంటే ఉన్నత శిఖరాలకు వెళతారనుకుంటే పొరపాటన్నారు. నిత్యజీవితంలో పుస్తకానికి ఎంతో ప్రాధాన్యం ఉందని తెలిపారు. విజయవాడలో గత 29 ఏళ్లుగా పుస్తక మహోత్సవాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. నేడు కొన్ని సినిమాల్లో వాడే పదాలు ఏమాత్రం గౌరవప్రదంగా ఉండటం లేదన్నారు. అటువంటి పదాలు వాడకుండానే శంకరాభరణం, సీతారామయ్యగారి మనమరాలు వంటి మంచి చిత్రాలు కూడా వచ్చాయన్నారు. 

భాషా పరిరక్షణ సంవత్సరంగా 2018: సీఎం
కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగుభాష పరిరక్షణ సంవత్సరంగా 2018ని ప్రకటించారు. రాష్ట్రంలో సాంస్కృతిక, గ్రంథాలయశాఖలను కలిపి భాషను పరిపుష్టంచేస్తామని చెప్పారు. అన్ని జిల్లాల్లోనూ పుస్తకమహోత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తిసహకారం అందిస్తుందన్నారు.

Read latest Amaravati News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top