పోషణకు అభయం | - | Sakshi
Sakshi News home page

పోషణకు అభయం

Sep 11 2026 10:57 AM | Updated on Sep 11 2026 10:57 AM

చిన్నారులు, మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా నిర్వహణ

లోకేశ్వరం: చిన్నారులు, మహిళలకు పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు జిల్లాలోని అన్ని మండలాల్లో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్‌ 8 వరకు ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ మాసోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.జంక్‌ ఫుడ్‌ వినియోగం తగ్గించడం, చక్కెర, ఉప్పు, నూనె వాడకాన్ని పరిమితం చేయడంపై ప్రచారం నిర్వహించనున్నారు. నెల రోజులపాటు ప్రతిరోజూ ఒక కార్యక్రమం నిర్వహించేందుకు క్యాలెండర్‌ రూపొందించారు.

నెలరోజులు కార్యక్రమాలు

ఈ నెల 9 నుంచి అక్టోబర్‌ 8 వరకు ప్రతిరోజూ ఒక కార్యక్రమం రూపొందించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, పాలిచ్చే తల్లులు, శిశువులు, చిన్నపిల్లల పోషణపై సలహా సమావేశాలు, పౌష్టికాహారం తయారీపై వంటకాల పోటీలు నిర్వహిస్తారు. కిశోర బాలికలు, పెద్దవారికి బీఎంఐ పరీక్షలు, పిల్లల ఎత్తు–బరువు కొలతలు తీస్తారు. ఆహారంలో చక్కెర, నూనె వినియోగం తగ్గించే విషయంపై అవగాహన కల్పిస్తారు.

నిర్వహణ ఏర్పాట్లు..

జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ మాసం నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. నిర్దేశిత క్యాలండర్‌ ప్రకారం నిత్యం ఓ కార్యక్రమం నెలరోజులపాటు నిర్వహిస్తాం. చిన్నారులు, మహిళలకు ఆరోగ్యంపై సంపూర్ణ అవగాహన కల్పిస్తాం. – వినూత్న, డీడబ్ల్యూవో

ప్రతీ ఇంటికీ పోషణ సందేశం

చిన్నారులు, మహిళల ఆరోగ్యం, పోషకాహారాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. అంగన్‌వాడీ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికీ పోషణ సందేశం చేరవేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. పోషణ మాసంలో ప్రజా ప్రతినిధులను కూడా భాగస్వాములను చేస్తున్నారు. ప్రతీ నియోజకవర్గంలో స్థానిక ప్రజా ప్రతినిధులకు ఆశ కార్యకర్తల ద్వారా లేఖలు పంపారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పోషణపై చైతన్య కార్యక్రమాలు, అవగాహన శిబిరాలు, ఆరోగ్య పరీక్షల క్యాంపులు నిర్వహించనున్నారు.

ప్రారంభమైన పోషణ మాసోత్సవం

జిల్లాలో ఇలా..

జిల్లాలో ఖానాపూర్‌, భైంసా, నిర్మల్‌, ముధోల్‌ ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 931 అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. జిల్లాలో 0–3 ఏళ్ల చిన్నారులు 27,853 మంది, 3–6 ఏళ్ల చిన్నారులు 22,383 మంది నమోదయ్యారు. గర్భిణులు 5,415, బాలింతలు 3,399 మంది ఉన్నారు. తీవ్ర పోషకాహార లోపం ఉన్న పిల్లలు 277 మంది, తక్కువ పోషకాహార లోపం ఉన్న పిల్లలు 1,345 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చిన్నారులను పోషకాహార లోపం నుంచి దూరం చేసేందుకు ఈ కార్యక్రమం ద్వారా శ్రీకారం చుట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement