ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆశావర్కర్ల సమస్యలు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి గుర్తుకు వస్తున్నాయని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పేర్నినాని విమర్శించారు. విజయవాడలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..గర్బిణీలను ప్రసవానికి తీసుకెళ్లేటప్పుడు కూడా తన గురించి చెప్పాలంటూ ఆశావర్కర్లకు చంద్రబాబు సూచించడం విడ్డూరంగా ఉందన్నారు. బిడ్డ పుట్టి ఓటు హక్కు వచ్చిన తర్వాత తనకే ఓటు వేస్తారని చంద్రబాబు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కంసుడు లాంటి చంద్రబాబు నాయుడి గురించి ప్రతి తల్లీ తన బిడ్డకు వివరిస్తుందని ఎద్దేవా చేశారు. ఆశావర్కర్లు గతంలో జీతాలు పెంచమని అడిగితే పోలీసు లాఠీలతో కొట్టించిన చరిత్ర చంద్రబాబుదని గుర్తు చేశారు.