భారత్‌ Vs చైనా: అరుణాచల్‌పై మళ్లీ కవ్వింపులు.. | Sakshi
Sakshi News home page

భారత్‌ Vs చైనా: అరుణాచల్‌పై మళ్లీ కవ్వింపులు..

Published Tue, Apr 2 2024 8:06 AM

China Released 30 New Names Of Various Places In Arunachal Pradesh

బీజింగ్‌: డ్రాగన్‌ కంట్రీ చైనా మరోసారి భారత్‌తో కవ్వింపు చర్యలకు దిగింది. ఎన్నికల వేళ భారత సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌ విషయంలో మరో దుందుడుకు చర్యకు దిగింది. తాజాగా అరుణాచల్‌లో కొన్ని ప్రాంతాలకు అధికారికంగా పేర్లు పెట్టింది.

కాగా, చైనా వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్‌ ప్రదేశ్‌ తమదేనని ఇటీవలే చైనా వితండవాదం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనా మరో అడుగు వేసి మరోసారి అక్కడి ప్రాంతాలకు అధికారికంగా పేర్లు పెట్టింది. ఈ మేరకు చైనా పౌర వ్యవహారాల శాఖ ఇటీవల ఈ కొత్త పేర్లను విడుదల చేశారు.

అరుణాచల్‌లోని మొత్తం 30 ప్రాంతాలకు చైనా తాజాగా కొత్త పేర్లను పెట్టినట్లు తెలుస్తోంది. వీటిల్లో 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, నాలుగు నదులు, ఒక సరస్సు, ఒక పర్వత మార్గం, కొంత భూభాగం ఉన్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో చైనా చర్యలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ స్పందిస్తూ.. ఈరోజు నేను మీ ఇంటి పేరు మర్చినట్లయితే అది నాది అవుతుందా?. అరుణాచల్‌ భారత్‌లో ఒక రాష్ట్రం. అరుణాచల్‌ ఎల్లప్పుడూ భారత్‌ భూభాగమే. పేర్లు మార్చడం వల్ల ప్రభావం ఏమీ ఉండదు. వాస్తవాధీన రేఖ వద్ద మా సైనం మోహరించి ఉంది అని కామెంట్స్‌ చేశారు.

 

ఇదిలా ఉండగా.. భారత భూభాగంలోని ప్రదేశాల పేర్లను మార్చేందుకు చైనా ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. చైనా 2017లో అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరు ప్రదేశాలకు, 2021లో 15 స్థలాలకు, 2023లో 11 ప్రాంతాలకు కొత్త పేర్లను చైనా ప్రకటించింది. ఇవన్నీ తమ దేశంలోని ప్రాంతాలేనని చెప్పుకొచ్చింది. 

Advertisement