బద్వేలు అర్బన్ : టీడీపీ ఇన్‌చార్జి మెప్పు కోసం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఘటనతో సంబంధం లేకపోయినప్పటికీ ఘటన జరిగిన గ్రామంలో ఉన్న ఒకే ఒక కారణంతో టీడీపీ ఇన్‌ఛార్జి సూర్యనారాయణరెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ యువనేత, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యరెడ్డిపై అక్రమ కేసు నమోదు చేశారు. గోపవరం మండలం ఎస్.రామాపురం గ్రామం నుంచి ఆదిత్యరెడ్డిని స్టేషన్‌కు తరలించే క్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు అడుగడుగునా అడ్డుకుని ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
యువనేతపై అక్రమ కేసుః
గోపవరం మండలం బ్రాహ్మణపల్లె ఎంపీటీసీ, గోపవరం జెడ్పీటీసీ స్థానానికి గురువారం జరిగిన ఎన్నికల నేపథ్యంలో ఉదయం నుంచి టీడీపీ ఇన్‌చార్జి సూర్యనారాయణరెడ్డి బద్వేలు మున్సిపాలిటీ, అట్లూరు మండలాలకు చెందిన వందలాది మందిని వెంట పెట్టుకుని గోపవరంలోని ఆయా పోలింగ్‌బూత్‌ల వద్ద హల్‌చల్ చేశారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను కూడా లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అప్పటికే గోపవరం మండలానికి చేరుకున్న ఎమ్మెల్యే డాక్టర్ సుధ ఆయా పోలింగ్ బూత్‌ల వద్దకు వెళ్లి టీడీపీ దౌర్జన్యాలను పోలీసులకు వివరిస్తూ వచ్చారు. ఎమ్మెల్యే ఒక్కరే అన్ని బూత్‌లకు తిరుగుతుండటం కష్టతరం కావడంతో మధ్యాహ్నం సమయంలో వైఎస్సార్‌సీపీ యువనేత ఆదిత్యరెడ్డి బ్రాహ్మణపల్లె, ఎస్.రామాపురం పోలింగ్‌బూత్‌ల వద్దకు వెళ్లారు. అక్కడ పరిస్థితిని పోలీసులకు వివరించి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేసి గ్రామంలోని వైఎస్సార్‌సీపీ నేత ఇంటి వద్దకు వచ్చారు. ఇదే సమయంలో ఉదయం నుంచి పోలీసుల అదుపులో ఉన్న ఎంపీటీసీ అభ్యర్థి భర్త కలువాయినరసారెడ్డి ఓటు వేసేందుకు రామాపురంలోని పోలింగ్ బూత్ వద్దకు వెళ్లాడు. అయితే అప్పటికే అతని ఓటును టీడీపీ మూకలు వేసేశారు. దీనిపై కలతచెందిన నరసారెడ్డి అధికారులను ప్రశ్నించారు. వారి నుంచి సమాధానం రాకపోవడంతో బ్యాలెట్ బాక్స్‌లో సిరా వేసేందుకు యత్నించారు. ఇంతలో పోలీసులు అడ్డుకుని ఆయనను బయటికి తీసుకొచ్చారు. ఇదే అదునుగా భావించిన టీడీపీ ఇన్‌చార్జి సూర్యనారాయణరెడ్డి పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చి నరసారెడ్డితో పాటు ఘటనతో సంబంధం లేని ఆదిత్యరెడ్డిపై కూడా కేసు నమోదు చేయించారు. కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు అర్ధరాత్రి వరకు ఆదిత్యరెడ్డిని పోలీసుస్టేషన్‌లోనే ఉంచి అనంతరం నోటీసులు ఇచ్చి పంపించి వేశారు.
అక్రమ అరెస్టును వ్యతిరేకించిన
వైఎస్సార్‌సీపీ శ్రేణులు
టీడీపీ ఇన్‌చార్జి ఆదేశాలతో ఆదిత్యరెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసి అరెస్టు చేసి స్టేషన్‌కు తరలిస్తున్నారన్న విషయం తెలియడంతో నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు బద్వేలు రూరల్ పోలీసుస్టేషన్ వద్దకు తరలివచ్చారు. ఆదిత్యరెడ్డిని తరలిస్తున్న పోలీసు వాహనాన్ని అడ్డుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఆదిత్యరెడ్డిని రూరల్ స్టేషన్‌కు తీసుకురాకుండా అర్బన్ స్టేషన్ ఆవరణలోని రూరల్ సర్కిల్ కార్యాలయానికి తరలించారు. అక్కడ కూడా వైఎస్సార్‌సీపీ నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. చివరకు ఆదిత్యరెడ్డిని రూరల్ సీఐ కార్యాలయానికి తరలించి దాదాపు నాలుగు గంటల పాటు అక్కటే ఉంచి అనంతరం నోటీసులు ఇచ్చి పంపించి వేశారు. ఆదిత్యరెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నేతలు స్టేషన్ వద్దే ఉన్నారు.
టీడీపీ ఇన్‌చార్జి ఆదేశాలతో యువనేత ఆదిత్యరెడ్డిపై అక్రమ కేసు
పోలింగ్ బూత్‌లలో టీడీపీ దౌర్జన్యాలు – ఖాకీల అండ!


