మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీలోని ధరణి తిమ్మాయపల్లె వద్ద ఉన్న వూసయ్యగారి ఆశ్రమంలో గురువారం అవదూత కొండయ్య స్వామి 45వ జన్మదిన వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కొండయ్య స్వామి శిష్య బృందం ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో గురువారం ఉదయం నుంచే రాయలసీమ, కోస్తా జిల్లాల నుంచి శిష్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో ఆశ్రమానికి చేరుకున్నారు. ఉదయం నుంచి పూజా కార్యక్రమాలను నిర్వహించిన కొండయ్య స్వామి అనంతరం భక్తులకు దర్శనమిచ్చి ఆశీర్వదించారు. ఆశ్రమ నిర్వాహకులు తీసుకొచ్చిన 45 కిలోలు ఉన్న ఆరు కేక్‌ల్లో ఒక దానిని మధ్యాహ్నం భక్త జన సందోహం మధ్య కట్ చేశారు. ఒక వైపు చెక్కభజన, మరో వైపు కోలాటం, పండరి భజనతో ఆశ్రమం అంతా కోలాహలంగా మారింది. ఆశ్రమంలో ఉదయం ఉంచి రాత్రి వరకు అన్న ప్రసాద వినియోగం చేశారు. కొండయ్య స్వామి జన్మదిన వేడుకల్లో భాగంగా గురువారం రాత్రి ప్రదర్శించిన పౌరాణిక నాటకాలు అందరినీ అలరించాయి. . టెలివిజన్ కళాకారులచే జబర్దస్త్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం ఆశ్రమం ఆవరణంలో వృషభరాజములకు రాష్ట్రస్థాయి బండలాడుగు పోటీలను నిర్వహించనున్నారు.


