టాస్క్‌ఫోర్స్ : గాలివీడు మండలంలోని పూలుకుంట వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి పార్వతమ్మ తరపున ఏజెంట్‌గా ఉన్న ఎం.రామాంజనేయులపై గుర్తు తెలియని వ్యక్తులు రెండు వాహనాల్లో వచ్చి గాయపరిచారు. ఈ మేరకు రామాంజనేయులు, ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. క్షతగాత్రుడిని వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించినట్లు వారు తెలియజేశారు.
దాడి ప్రచారంలో వాస్తవం లేదు.
పూలుకుంట ఎంపీటీసీ పోలింగ్ ఏజెంట్ మహాదేవపల్లి రామాంజనేయులుపై దాడి జరిగిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై పోలీసులు స్పందించారు. ఎస్‌ఐ నరసింహారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రామాంజనేయులుపై ఎవరూ దాడి చేయలేదు. తన ఇంటి సమీపంలో బ్లేడ్‌తో తన నుదుటిపై తనే గాయపరుచుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ ఉద్రిక్తతలు సృష్టించేందుకు ఇలాంటి తప్పుడు ఫొటోలు, వీడియోలు ప్రచారం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.
బైక్ అదుపుతప్పి
కిందపడి మహిళ మృతి
మదనపల్లె టౌన్: కురబలకోట మండలంలోని అంగళ్లు దుర్గా డాబా వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి మహిళ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లెకు చెందిన నూర్జహాన్ (53) బి.కొత్తకోటకు సొంత పనుల మీద వెళ్లింది. అక్కడ పనులు ముగించుకుని తిరిగి మదనపల్లెకు వెళ్తుండగా,మార్గమద్యంలోని అంగళ్లు వద్ద రోడ్డు మధ్యలో గుంత ఉండటంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి నూర్జహాన్ కింద పడింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న ముదివేడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రోడ్డుపై గుంతల కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో
రైతు మృతి
వీరపునాయునిపల్లె: మండలంలోని ఇందుకూరు కొత్తపల్లె గ్రామంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు జూటూరు బ్రహ్మానందరెడ్డి (56) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రహ్మానందరెడ్డి గురువారం ఉదయాన్నే తన పొలం వద్ద మోటారు ఆన్ చేయడానికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో షాక్‌కు గురై సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


