● స్వతంత్య్రఅభ్యర్థి పత్రాలు చించివేత
● ఖాకీ కళ్లెదుటే టీడీపీ మూకల వీరంగం
మున్సిపాలిటీ ప్రవేశద్వారం వద్ద మోహరించిన టీడీపీ శ్రేణులు
కట్టెలు తీసుకునే ప్రయత్నం చేసిన టీడీపీకి చెందిన వ్యక్తిని పట్టుకుపోతున్న ఎస్ఐ
రాజంపేట: రాజంపేట మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల పర్వంలో అధికార తెలుగుదేశం పార్టీ శ్రేణులు బరితెగించి ప్రవర్తించాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ తప్ప మరెవ్వరూ నామినేషన్లు వేయకూడదనే రీతిలో ప్రజల్లో, ప్రత్యర్థుల్లో తీవ్ర భయాందోళన వాతావరణాన్ని సృష్టించారు. డీఎస్పీ వెంకట్రామయ్య, సీఐలు హేమసుందరనాయుడు, లింగప్ప, ఎస్ఐలు బందోబస్తులో ఉన్నప్పటికీ, ఖాకీల కళ్లెదుటే టీడీపీ మూకలు వీరంగం సృష్టించినా పోలీసులు వారిని నియంత్రించలేకపోయారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్మోహన్రాజు ఆధ్వర్యంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు టీడీపీ శ్రేణులు మున్సిపాలిటీ కార్యాలయం వద్దే మోహరించగా, పట్టణంలో భారీగా స్థానికేతరులు కనిపించడం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.
మహిళా అభ్యర్థి పత్రాలు, సర్టిఫికెట్ల చించివేత
చైర్పర్సన్ స్థానానికి పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాలు, విద్యా అర్హతల సర్టిఫికెట్లతో వచ్చిన స్వతంత్ర అభ్యర్థి బీ. రేణును డీసీసీబీ బ్యాంకు ప్రవేశద్వారం వద్ద టీడీపీ దౌర్జన్యకారులు అడ్డుకున్నారు. కనీసం మహిళ అని కూడా చూడకుండా ఆమె చేతిలో ఉన్న పత్రాలను లాక్కొని ముక్కలుగా చించివేశారు. పోలీసులు చూస్తూ ఉండిపోయారే తప్ప దౌర్జన్యకారులను బెదరగొట్టే చర్యలు తీసుకోలేదు. దీనిపై బాధితురాలు మీడియా ముందు నిరసన గళం విప్పగా, అక్కడ కూడా తమ్ముళ్లు ఆమెను అడ్డుకునేందుకు ప్రవర్తించారు. ఒక జిల్లాకు డిప్యూటీ కలెక్టర్గా, మాజీ డీఆర్వోగా పనిచేసిన ఉన్నతాధికారి ఈశ్వరయ్య తన నామినేషన్ పత్రాలతో రాగా, టీడీపీ దుండగులు ఆయన్ను అడ్డగించి పత్రాలను చించివేశారు. పోలీసుల సమక్షంలోనే ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చ తెచ్చేలా ఈ ఘటన జరగడంతో పలువురు అవాక్కయ్యారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వస్తున్నారనే సమాచారంతో టీడీపీ మూకలు కట్టెలు చేతబూని మున్సిపాలిటీ ప్రవేశద్వారం వైపు పరుగు తీశాయి. సీఐ హేమసుందరం వాహనంలో ఉన్న కట్టెలను సైతం లాక్కునేందుకు ప్రయత్నించగా ఎస్ఐ మహేష్ నాయుడు అడ్డుకుని వారిలో ఒకరిని పట్టుకున్నారు. పోలీసులు వెంటనే సమీపంలోని దుకాణాల షెట్టర్లు తెరిపించి తనిఖీలు చేయగా, అక్కడ నిల్వ ఉంచిన భారీగా కట్టెలను స్వాధీనం చేసుకున్నారు.


