ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించాలి

Oct 17 2026 3:09 AM | Updated on Oct 17 2026 3:09 AM

● మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా

కడపకార్పొరేషన్‌: స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా డిమాండ్‌ చేశారు. శుక్రవారం సాయంత్రం సీఈసీ సభ్యులు కె. సురేష్‌ బాబుతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ తీరు చూస్తుంటే అసలు ప్రజాస్వామ్యం ఉందా, రాజ్యాంగం అమలవుతోందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఒక పార్లమెంటు సభ్యుడికే రక్షణ లేకపోతే సామాన్యులకు ఏం ఉంటుందని ప్రశ్నించారు. పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడి చేశారని, ఎంపీకి రక్షణగా ఉన్న బాడీగార్డును గాయపరిచారన్నారు. రాయచోటిలో వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి పదుల సంఖ్యలో వాహనాలకు నిప్పుపెట్టారన్నారు. భయానక వాతావరణం సృష్టించి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్‌ వేయకుండా చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించే సత్తా లేనప్పుడు నామినేషన్‌ పద్ధతిలో ఎన్నుకోవచ్చు కదా...ఎన్నికలు నిర్వహించడం దేనికని ప్రశ్నించారు. నామినేషన్‌ సెంటర్ల వద్ద సుమారు 200 మంది గుండాలు, రౌడీలు, గంజాయి బ్యాచ్‌లను దింపి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులు చేస్తున్నారన్నారు. తొలిరోజే 30వ డివిజన్‌లో నామినేషన్‌ వేయడానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి టి. విజయలక్ష్మి, 51వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పద్మలత నామినేషన్లు లాక్కొని చించివేశారన్నారు. వారు బయటికి వచ్చిన తర్వాత కూడా భౌతిక దాడికి పాల్పడ్డారన్నారు. 50వ డివిజన్‌లో ఆటోలో వెళ్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బవసరాజుపై దాడి చేసి నామినేషన్‌ పత్రాలు, సెల్‌ఫోన్‌ లాక్కుని వెళ్లారన్నారు. ఇన్ని దాడులు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం బాధాకరమన్నారు. తిరుమల బ్రహ్మోత్సవాలు, దసరా పండుగ ఉన్న సమయంలో బందోబస్తు ఇవ్వలేనప్పుడు ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నారని నిలదీశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు పోలీసులు రక్షణ ఇవ్వలేకపోతే తామే తమ కార్యకర్తలతో కల్పించుకుంటామన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే ఒక్క టీడీపీ అభ్యర్థి కూడా గెలవరన్నారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని అంతమొందించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. అనంతరం మాజీ కార్పొరేటర్‌ బసవరాజు మాట్లాడుతూ పాలెంపల్లె సుబ్బారెడ్డి, యువరాజ్‌, శివ, బిట్టూ అనే వారు కాపు కాసి ఆటోలో వెళ్తున్న తనపై దాడి చేసి నామినేషన్‌ పత్రాలు, సెల్‌ఫోన్‌ లాక్కున్నారన్నారు. నిష్ఫక్షపాతంగా ఎన్నికలు జరిపితే ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుందన్నారు. వారి నుంచి రక్షణ కల్పించాలని, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి, జోన్‌ అధ్యక్షుడు పి. రామ్మోహన్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్‌ ఉమైర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement