కూటమి తీరుపై ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆగ్రహం!
ఎర్రగుంట్ల : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేస్తే చంపుతామంటూ కూటమి నాయకులు బెదిరింపులకు దిగడంపై జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పి. రామసుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రగుంట్ల మున్సిపాలిటీ పరిధిలోని వైఎస్సార్సీపీ అభ్యర్థి బావక్క, ఆమె భర్త సిద్ధయ్య నివాసానికి శుక్రవారం వెళ్లిన ఆయన, బెదిరింపులకు గురైన ఆ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి నేతల దౌర్జన్యాలపై మండిపడ్డారు. సిద్ధయ్య ఇంట్లో లేని సమయంలో కూటమి నాయకులు జగదీశ్వర్ రెడ్డి, రాజారెడ్డిలతో పాటు మరికొందరు అభ్యర్థి బావక్కతో పాటు ఆమె కుటుంబాన్ని తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేశారని ఎమ్మెల్సీ ఆరోపించారు. మున్సిపాలిటీ కార్యాలయం వద్దనే నరికేస్తామని, చంపుతామని హెచ్చరించడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ నామినేషన్లకే ఇక్కడి ‘బాబాయ్–అబ్బాయ్’లు భయపడుతున్నారని, ఓటమి భయం వెంటాడుతుండడం వల్లే కూటమి నేతలు ఇలాంటి బెదిరింపుల సంస్కృతికి తెరలేపారని రామసుబ్బారెడ్డి విమర్శించారు.
ప్రజాస్వామ్యం ఖూనీ
చంద్రబాబు గతంలో నాలుగుసార్లు సీఎంగా చేసినప్పుడు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు లేవని, నేను కూడా ఆయన పాలనలో పనిచేశానని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కూటమి పాలనలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అవుతోందని, దీనివల్ల సీఎం చంద్రబాబుకు పూర్తి చెడ్డపేరు వస్తోందని పేర్కొన్నారు. మొన్న పులివెందుల ఎన్నికల్లోనూ ఐపీఎస్, ఐఏఎస్, డీఐజీలు ఉండి కూడా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. కూటమి నేతల ఉడత బెదిరింపులకు తామెవరూ భయపడే ప్రసక్తే లేదని, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీల్లోని అన్ని వార్డులలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు కచ్చితంగా నామినేషన్లు వేస్తారని స్పష్టం చేశారు. అధికారులు స్పందించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
నామినేషన్ వేస్తే చంపేస్తామని బెదిరించిన కూటమి నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అభ్యర్థి బావక్క, ఆమె భర్త సిద్ధయ్య.. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సమక్షంలో ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథ్రెడ్డికి అధికారికంగా ఫిర్యాదు చేశారు. తాను ఎన్ఓసీ కోసం కార్యాలయానికి వెళ్లినప్పుడు కూడా కూటమి నాయకులు చుట్టుముట్టి బెదిరించారని, మా నాయకుడు భూపేష్ రెడ్డి పిలుస్తున్నారంటూ బెదిరింపులకు దిగారని సిద్ధయ్య ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. అయినా వెనక్కి తగ్గేది లేదని, నామినేషన్ కచ్చితంగా వేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎస్ఈసీ మెంబర్ గిరిధర్రెడ్డి, యువ నాయకుడు పి. శివారెడ్డి పాల్గొన్నారు.


