కట్టుకున్నోడే కడతేర్చాడు | - | Sakshi
Sakshi News home page

కట్టుకున్నోడే కడతేర్చాడు

Oct 17 2026 3:03 AM | Updated on Oct 17 2026 3:03 AM

బద్వేలు అర్బన్‌ : స్థానిక సిద్దవటంరోడ్డులోని సీఎస్‌ఐ చర్చి సమీపంలో ఓ మహిళ తన భర్త చేతిలో దారుణహత్యకు గురైంది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కడప పట్టణంలోని విశ్వనాథపురానికి చెందిన సమ్మెటసౌందర్‌రాజు, కిరణ్‌జ్యోతి దంపతుల కుమార్తె అయిన ప్రవళ్లిక (29) బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తుండేది. కరోనా సమయంలో ఇంటి వద్దే ఉంటూ పని చేసుకుంటూ ఉండేది. ఆ సమయంలో కడప నగరం అంగడివీధికి చెందిన చెన్నూరుసాయిబాబా ప్రవళ్లిక ఇంటిపై అద్దెకు చేరాడు. ఈ క్రమంలో సాయిబాబా ప్రవళ్లికతో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. కొన్ని రోజులకు ఇరువురు ఇంటి నుంచి వెళ్లి పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా కులాంతర వివాహం చేసుకున్నారు. ఏడాది పాటు వివిధ ప్రాంతాల్లో కాపురం పెట్టారు. ఏడాది తర్వాత మనస్పర్థలు రావడంతో ప్రవళ్లిక తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. తిరిగి కడపలోని ఓ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో సాయిబాబపై కేసు కూడా నమోదైంది. తర్వాత కొద్ది రోజులకు సాయిబాబా పెద్దమనుషుల ద్వారా పంచాయతీ పెట్టి ప్రవళ్లికను కలుసుకున్నారు. ఆ సమయంలో వీరికి ఒక కుమార్తె జన్మించింది. తిరిగి సాయిబాబా వేధించడం మొదలు పెట్టడంతో కొన్ని నెలలుగా అతనికి దూరంగా ఉంటూ బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటుండేది. ఈ నేపథ్యంలో పట్టణంలోని సిద్దవటం రోడ్డులో ఉన్న ప్రవళ్లిక అమ్మమ్మ కాంతమ్మ అనారోగ్యానికి గురికావడంతో వారం రోజుల కిందట బద్వేలుకు వచ్చింది. ఇదే సమయంలో సౌందర్‌రాజు కూడా బద్వేలుకు వచ్చాడు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ప్రవళ్లిక, ఆమె తండ్రి ఇంట్లో భోజనం చేస్తుండగా సాయిబాబా ఇంట్లోకి ప్రవేశించి ఒక్కసారిగా ప్రవళ్లికపై తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె మెడ, కడపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. సౌందర్‌రాజు గట్టిగా కేకలు వేయడంతో సాయిబాబా అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే స్థానికులు 108 వాహనం ద్వారా ప్రవళ్లికను ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందింది. విషయం తెలుసుకున్న అర్బన్‌ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రవళ్ళిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.

బద్వేలులో మహిళ దారుణహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement