● పోలీసుల సమక్షంలోనే గాయపరిచినా కూటమిగూండాలపై చర్యలేవీ ..?
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి
కడప అర్బన్: కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మూకలు గూండాలుగా మారి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, వారికి ప్రజలే ఈ ఎన్నికల సమయంలో బుద్ధి చెబుతారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం కడప నగరంలోని కాగితాలపెంటలో నామినేషన్ కేంద్రంలో 51వ డివిజన్‌కు నామినేషన్ వేసేందుకు పద్మలత, సోదరుడు బాలస్వామిరెడ్డి వెళ్లారన్నారు. ఆ సమయంలో కూటమి గూండాలు ప్రవేశించి నామినేషన్ పత్రాలను చించివేశారన్నారు. మరళా రెండవసారి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించిన తరువాత కూడా గూండాలు ప్రవేశించి పత్రాలను చించివేశారన్నారు. తరువాత నామినేషన్ కేంద్రం బయటకు రాగానే అక్కడ దాడిచేశారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ పోలీసుల అండదండలతోనే అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం, అధికార బలంతో ఓటర్లను బెదిరించడం లాంటి దుశ్చర్యలతోనే కాలం గడుపుతున్నారన్నారు. పులివెందుల, ఒంటిమిట్ట మండలాలలో జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా తమ అధికార బలంతోనే గెలువగలిగారన్నారు. శుక్రవారం పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై, రాయచోటిలో మాజీ విప్‌గా పనిచేసిన గడికోట శ్రీకాంత్‌రెడ్డిలపై హత్యాయత్నాలకు పాల్పడి వాహనాలను తగులబెట్టి కూటమి ప్రభుత్వ గూండాలు తమ దమనకాండను చాటుకుంటున్నారన్నారు. ఈ మాజీ మేయర్ పాకా సురేష్‌కుమార్, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మాజీ మేయర్ కె.సురేష్‌బాబు పాల్గొన్నారు. బాలస్వామిరెడ్డిపై దాడికి సంబంధించి కడప తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఇప్పటికే ఫిర్యాదు చేశామన్నారు.


