కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్నిరకాల ఏర్పాట్లు సిద్ధం చేశామని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. గురువారం కలెక్టరేట్లో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, జేసీ డాక్టర్ నిధి మీనా, డీఆర్వో మల్లికార్జునుడుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో శుక్రవారం నుంచి అధికారికంగా ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే ఓటర్ల జాబితా ప్రచురణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సెన్షిటీవ్, హైపర్ సెన్సిటీవ్ పోలింగ్ కేంద్రాల వర్గీకరణ, సిబ్బంది కేటాయింపు వంటివి పూర్తి చేశామన్నారు. అప్డేటెడ్ ఓటర్ల జాబితాలు అందుబాటులోకి వచ్చాయని, వాటిని మున్సిపల్ కమిషనర్లకు అందజేస్తున్నామన్నారు. ఓటర్లు తమ పేర్లు ఉన్నాయో లేదో సరిచూసుకోవాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూమును ఆశ్రయించవచ్చన్నారు. కుల ధ్రువీకరణ, నో డ్యూస్ సర్టిఫికెట్లను 24 గంటల్లోనే అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
కట్టుదిట్టమైన చర్యలు – ఎస్పీ
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు. ముందస్తుగా బైండోవర్లు, పీడీయాక్టుల నమోదు వంటివి చేపట్టామన్నారు. మొబైల్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్స్‌లు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, షాడో పార్టీలు, పికెట్ ఫోర్స్, బార్డర్ చెక్‌పోస్టులు ఏర్పాటుచేశామన్నారు. మున్సిపల్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లన్నింటినీ చెక్‌పోస్టులతో కవర్ చేస్తున్నామన్నారు. జిల్లాలో మొత్తం 8 ఎంట్రీ–ఎగ్జిట్ లొకేషన్లలో భద్రత కల్పించామన్నారు. చెక్‌పోస్టుల వద్ద సీసీ టీవీ, పీటీ జెడ్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలు, నామినేషన్ కేంద్రాల్లో సీసీ టీవీ నిఘా ఉంటుందన్నారు.
ఏర్పాట్లు ముమ్మరం – జేసీ
జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా మాట్లాడుతూ ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఖరారు, అలాగే పోలింగ్‌కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం, ఇతర ప్రాథమిక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వీడియోగ్రఫీ ఏర్పాట్లు పూర్తయ్యాయని, వెబ్‌కాస్టింగ్ ప్రక్రియ ఫైనలైజ్ కావాల్సి ఉందన్నారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సిబ్బంది డేటాబేస్ ఇప్పటికే సిద్దం చేశామని, కాగా ఈసారి కొత్తగా ర్యాండమైజేషన్ సాఫ్ట్వేర్ ద్వారా సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు కేటాయించనున్నట్లు తెలిపారు.
కౌంటింగ్ కేంద్రాలు
కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మౌలాన ఆజాద్ ఉర్దూ యూనివర్శిటీ, ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, మైదుకూరు మున్సిపాలిటీ కౌన్సిల్ హాలు, జమ్మలమడుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఎర్రగుంట్ల, కమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, పులివెందుల జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, బద్వేలు బీఆర్ అంబేడ్కర్ గురుకులం, రాజంపేట జెడ్పీ హైస్కూల్లో కౌంటింగ్ కేంద్రాలు ఉంటాయని జేసీ వివరించారు.
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి


